పుట:Andhrula Charitramu Part 2.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గరికాలచోడవంశజుడును, తెలుగుచోడుడునైన దాసవర్మ పాకనాటిని జయించి పొత్తపి రాజధానిగ బాకనాటిని బాలించుచుండెను. ఈ దాసవర్మ సంతతివారే తరువాతి కమ్మనాటిలోని కొట్యదొనను (కొణిదెన) రాజధానిగ జేసికొనిరి. మొదటివారు స్వతంత్రులుగనున్నను, తరువాతి వారు కులోత్తుంగచోడునికి సామంతులుగనుండిరి. ఈ వంశములోని వాడే యగు చోడబల్లి క్రీ.శ.1106వ సంవత్సర ప్రాంతముననున్నట్లు దెలియుచున్నది. కాబట్టి మన కుమారసంభవ కావ్యమును రచించిన నన్నెచోడకవి యితని కుమారుడేయైనయెడల బండ్రెండవ శతాబ్దారంభమునందనగా నన్నయభట్టారకునకు నరువది డెబ్బది సంవత్సరములకు దరువాతి వాడుగా నుండవలయును. ఇది వాస్తవముగాక యితడు పైని నేనుదాహరించిన చోడబల్లయ మహారాజునకు ముత్తాతయగు పొత్తపి నన్నెచోడుడే యైనపక్షమున నన్నయభట్టారకునితో సమకాలికుడైయుండవలయును.

మల్లికార్జునయోగి.

నన్నెచోడకవి తన కుమారసంభవమును మల్లికార్జునయోగి కంకితము చేయుచున్నాడనని యీ క్రిందిపద్యములో జెప్పియున్నాడు.

“ఉ. పూనిమహాగ్రహారపుర వుత్త్రసమున్నతి దేవతాలయో
ద్యానతటాక సత్కృతినిధానములాశశి తారకంబు సు
స్థానములై మహింబరగు జంగమ మల్లయపేర సప్తసం
తానములొప్ప సల్పుదుముదంబునదత్ప్రభునాజ్ఞ పెంపునన్.”

మల్లికార్జునయోగియే తనకు గవిత్వమును బ్రసాదించినవాడని యీ క్రింది పద్యములో మనోహరముగా జెప్పియున్నాడు.

“సీ. శరధినీరులు పయోధరములు కొనివచ్చి
కురిసి వారధియందు గూర్చునట్ల,