పుట:Andhrula Charitramu Part 2.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిమ్మట ద్రావిడచోడులకును, అటుపిమ్మట రాష్ట్రకూటులకును సామంతులుగనుండినటుల దోచుచున్నది. ఏది యెటులున్నను బాణులు, వైదుంబులు, రాష్ట్రకూటులు, పశ్చిమచాళుక్యులు, పల్లవులు, తెలుగుచోడులు, మొదలగువారు వేంగీదేశముయొక్క దక్షిణభాగమును, పూర్వచాళుక్య రాజకుమారులు వేంగీదేశముయొక్క యుత్తరభాగమును కల్లోల పెట్టుచుండుటచేతను, దానార్ణవుని కాలమున వేంగీదేశము అరాజకముగానుండెననుట కెంతమాత్రమును సందియము లేదు.

క్రీ.శ.985వ సంవత్సరమున రాజారాజరాజకేసరివర్మ చోడసామ్రాజ్యమునకభిషిక్తుడై, వేంగీదేశమరాజకముగనుండుటయు తత్కారణమున దనరాజ్యముయొక్క, యుత్తరభాగమున నల్లరులు రేగుటయుగాంచి, యుపేక్షించినచో దన సామ్రాజ్యమునకు భంగము సంభవించునని యూహించి క్రీ.శ.999వ సంవత్సరమున బహుసైన్యములంగూర్చుకొని వేంగిదేశమునపై దండెత్తి వచ్చి కలహకారులనెల్ల నడంచి దానార్ణవుని జ్యేష్ఠపుత్త్రుడగు శక్తివర్మను వేంగీరాజ్యమునకభిషిక్తుని గావించి, పిమ్మట స్వదేశమునకు వెడలిపోయెను. నాటినుండియు జోడులకును బూర్వచాళుక్యులకును మైత్రియొప్పుచుండెను. శక్తివర్మకు తరువాత వేంగీదేశమును బరిపాలించిన విమలాదిత్యుడును, రాజరాజనరేంద్రుడును,చోడ చక్రవర్తుల పుత్రికలనే వివాహమాడినవారగుటచేత రాజనరేంద్రుని పుత్త్రుడగు మొదటి కులోత్తుంగుని కాలమున రెండురాజ్యములైక్యమగుట సంభవించెను. రాజనరేంద్రుని మరణానంతరమున వీరరాజేంద్ర చోడచక్రవర్తి వేంగీకళింగ దేశములపై దండెత్తివచ్చిచాళుక్యసైన్యాధిపతులగు జననాథుని , రాజమయ్యను, ముప్పరాజును, విజయవాటిక (బెజవాడ) యొద్ద నెదుర్కొని యుద్ధముచేసి జయించి రాజనరేంద్రుని తమ్ముడగు విజయాదిత్యుని వేంగీ రాజ్యమునకభిషిక్తుని గావించెను. కాని క్రీ.శ.1070వ సంవత్సరమున కులోత్తుంగచోడుడు చోడసామ్రాజ్యమునకభిషిక్తుడై పినతండ్రి యగు విజయాదిత్యుని క్షమించి యాతని వేంగీదేశమునకు రాజప్రతినిధిగ నియమించెను. ఆ కాలముననే కాబోలు