పుట:Andhrula Charitramu Part 2.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేనబండిన విత్తు చేనికి ఫలకాంక్ష
బేర్మి గ్రమ్మర వెదవెట్టునట్ల,
రోహిణాచలపతి కూహించి వరరత్న
సంచయంబున విభూషించునట్ల,
తీర్థాళి కర్థి దత్తీర్థోదకంబుల
నెసకంబుగా నర్ఘ్యమిచ్చినట్ల,
నింగిముట్టియున్న జంగమమల్లయ
వరమునందు గనిన వస్తుకవిత
దగిలి వారియంద నెగడింతు రవికి దీ
పమున నర్చ లిచ్చుపగిది వోలె.“

ఈ మహాకవి యాశ్వాసాద్యంత పద్యములలో గృతిపతి యగు మల్లికార్జునయోగికిని శివునకు నభేదము గల్పించి యభివర్ణించి యపూర్వంబైన గురుభక్తిని వెల్లడించియున్నాడు.

శివయోగియైన యీ మల్లికార్జున దేవుడు బసవేశ్వరుని తండ్రియని చెప్పబడిన మండంగి మాదిరాజు కాలమున శ్రీశైలమున నివసించియుండెనని బసవపురాణాదులవలనం దెలియుచున్నది. ఇతనింగూర్చి బసవపురాణము 19, 20 అధ్యాయములలో వ్రాయబడియున్నది. వీరశైవమతోద్ధారకుడయిన బసవేశ్వరుని తండ్రియగు మండంగి మాదిరాజు ఇతనితో బ్రసంగించినటుల బసవపురాణమునం బేర్కొనబడినవి. అందితడు యోగియగుటకు బూర్వము మల్లరాజ ధరణీ వల్లభుడుగ నున్నటుల వర్ణింపబడి యున్నది. ఈ జంగమ మల్లికార్జున దేవుని బ్రహ్మర్షియనియు, భూసురకులతిలకుడనియు, నన్నెచోడుడభినందించియుండుటచేత నితడు బ్రాహ్మణుడని స్పష్టమగుచున్నది. బసవపురాణమునందు జెప్పినది వాస్తవమగునేని యితడు మొదట సైన్యాధిపతిగనో మంత్రిగనో యుండి తరువాత సన్న్యసించియుండిన నైయోగికారాధ్య