పుట:Andhrula Charitramu Part 2.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రకులమున జనించిన కార్తవీర్యార్జునుని వంశమునందు బుట్టిన చాగిబేటరాజు నలువురు కుమారులలోను రెండవ వాడగు వీరకాముని కొమారుడు బేటరాజు దీనికి భూదానము చేసియుండెను. ఈ యాదిత్యేశ్వరాలయమునకు దాన శాసనములను వ్రాయించినవారిలో నొకానొక కన్నడ నాగిమయ్య కలడు. ఈ శాసనములలోని లిపిన వ్రాసినవారు కూడా కన్నడము వారే. శాసనము దిగువ వారి నామములు కన్నడభాషలో వ్రాయబడినవి. ఈ విషయములు పశ్చిమ చాళుక్యుల యధికారము కొంతకాల మీ దేశమున వ్యాపించెనని చాటుచున్నవి.

విశ్వబ్రాహ్మణులు.

మరియు నీ మాచెర్ల శాసనమునందు నింకొక విశేషవిషయముగలదు. ఆదిత్యేశ్వర దేవాలయమును నాగస్తంభమును నిర్మించిన శిల్పకారులు కొనియాడబడియున్నారు. బ్రహ్మకుమారుడయిన విశ్వకర్మ యీ శిల్పకారులకు మూలపురుషుడనియు, సూర్యుని మామగారనియు, విశ్వకర్మ తనయుడైన సూర్యునికి కిరణములను విష్ణుచక్రము మొదలగు దివ్యాయుధములుగా మార్చెననియు జెప్పబడినది. విశ్వకర్మ వంశస్థులయిన ప్రసిద్ధాచార్యులు కొందరు పేర్కొనబడి, వారు శివలింగములను విగ్రహములను చేయుటయందును, వానివాని స్థానములను గుర్తెరుగుటయందును, చతుర్విధములయిన ప్రాసాదములను నిర్మించుటయందును, వాస్తుశాస్త్రములో నొక భాగమగు క్షేత్రగణిత జ్ఞానమునందును, వారల వృత్తికి సంబంధించిన పెక్కు విషయములయందును నేర్పరులనియు బ్రజ్ఞావంతులనియు చెప్పబడియున్నారు.

భూలోకమల్లుడు.

భూలోకమల్లుడనునది బిరుదనామమేకాని నిక్కమైన పేరుగాదు. ఇతని మొదటిపేరు సోమేశ్వరుడు. పశ్చిమచాళుక్య చక్రవర్తులలో సోమేశ్వరనామమును వహించినవారిలో నీతడు మూడవవాడు. ఇతడు 1127వ సంవత్సరము మొదలుకొని పదునొకండు సంవత్సరములు అనగా 1138వ