పుట:Andhrula Charitramu Part 2.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరము వరకు బరిపాలనము చేసియుండెను. ఇతడు ద్రావిడాంధ్ర మగధ నేపాల రాజులను జయించి పొగడ్త గాంచెనని తెలియుచున్నది. [1] ఇతడు సంస్కృతమున మానసోల్లాసము లేక అభిలషితార్థ చింతామణియను మహాగ్రంథమును రచించెను. ఇందు రాజధర్మములను గూర్చియు, ప్రజాధర్మములను గూర్చియు, నానా విధవిషయములను గూర్చియు, వ్రాయబడియున్నది. అనగా _ రాజనీతి, రాజ్యాంగము, జ్యౌతిషము, నవగ్రహఫలములు, భాషలు, శాస్త్రము, కావ్యము, సంగీతము, చిత్రలేఖనము, శిల్పచాతుర్యము, అశ్వశిక్ష, గజశిక్ష, శునకశిక్ష, మల్లయుద్ధము మొదలగు వానింగూర్చిన విశేషాంశములు గలవు. ఇట్టి మహాగ్రంథము నీతడు రచించుటచేతనే, సర్వజ్ఞభూపుడను బిరుదమును గాంచెను. ఇతడు సింహాసనమధిష్ఠించిన నాలుగవ సంవత్సరమున నీ మమాగ్రంథమును రచించెను. ఇతనికి తరువాత నీతని కుమారుడు జగదేకమల్లుడు 1138వ సంవత్సరమున సింహాసనమెక్కెను. ఇతడు పండ్రెండు సంవత్సరములు పరిపాలనము చేసెను గాని, యీతని కాలమునందలి విశేషాంశములేవియు గానరావు.

త్రైలోక్యమల్లుడు.

జగదేకమల్లుని సోదరుడగు త్రైలోక్యమల్లుడు శాలివాహన శకము 1070 యగు ప్రమోదూత సంవత్సరమున సింహాసనమెక్కెను. ఈ సోదరులిరువుర పరిపాలన కాలమున వీరికి లోబడియుండిన మహామండలేశ్వరులు కొందరు నిరంకుశాధికారులై పరాక్రమవంతులై వీరి యధికారమును ధిక్కరించిరి.

బిజ్జలుడు రాజ్యమాక్రమించుకొనుట.

కాలచుర్యుడును హైహయాన్వయుడునగు బిజ్జలుడు చాళుక్యుల బలహీనతను దెలిసికొని, చాళుక్య సామ్రాజ్యము నాక్రమించుకొనగోరి తక్కిన మహామండలేశ్వరులతో మైత్రింబాటించి కృతకృత్యుడయ్యెను.

  1. Jour. B.B.R.A.S., Vol.XI., p.268