పుట:Andhrula Charitramu Part 2.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చ. అలుక ప్రతాపమీగి యలవాలము బుద్ధిపరాపవాదముల్
పలుకుల ప్రొద్దుపోక ప్రజాబాధదలంపమి పెద్దప్రల్లదం
బలవు వికారమొప్పు వినయంబు మహత్త్వము చేటుబొంకువా
గ్బలము జఘన్యులైన నరపాలురకుం బరపక్షభైరవా.

చాగి బేటరాజు.

బిరుదాంక రుద్రుడను నామాంతరము గల చాగి బేటరాజు పల్నాటికి ప్రభువై భూలోకమల్లునకు గప్పము గట్టుచుండెను. ఇతడు హైహయవంశజుడు. ఈ రాజు కామనూరు గ్రామవాస్తవ్యుడును ఋగ్వేదపద పాఠియునగు నొక బ్రాహ్మణునిచే మాధవి [1] పట్టణమున బ్రతిష్ఠింపబడిన త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) దేవాలయమునకు శాలివాహనశకము 1051 సౌమ్యసంవత్సరమున (క్రీ.శ.1129_30) దానశాసనము వ్రాయించెను. ఈ శాసనము వ్రాయబడిన నాగస్తంభము కూడ నా కాలమునందే ప్రతిష్ఠింపబడినది. ఈ శాసనములోని మొదటి రెండు శ్లోకములలో 'శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, అబ్జుడు, మహాంబుజుడు, శంఖధరుడు, కుళికుడు' అనెడుఅష్టనాగములంగూర్చిన ప్రార్థనగలదు. పల్నాటిలోని మాచర్ల గ్రామము (మాధవిపట్టణము)లోని చెన్నకేశవస్వామి దేవాలయములో మరియొక నాగస్తంభముపై నింకొక శాసనము పండ్రెండవ శతాబ్ద ప్రారంభము నాటిది కలదు. ఆ శాసనమునందును అష్టనాగములను గూర్చిన ప్రార్థనగలదు. పల్నాటికి రాజధానియగు మహాదేవితటాకము [2]నందునొకానొక యాదిత్యునిచే నాదిత్యేశ్వర దేవాలయము నిర్మింపబడినది.

  1. మాధవిపట్టణము దెనుగులో గురివింద స్థలమనియు, గురిజాలయనియు జెప్పబడుచున్నది.
  2. మహాదేవితటాకము మాదేవిచెరువు, మాదేవిచర్ల, మాచర్ల యని చెప్పబడుచున్నది.