పుట:Andhrula Charitramu Part 2.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాత్రమగునని స్పష్టముగ జెప్పుకొనియున్నాడు. తన తాతయైన మంత్రి భాస్కరుడు ఆ కాలమునందంతటి ప్రసిద్ధకవి కాకయుండినయెడల తిక్కనవంటి కవిరాజశిఖామణియట్లు చెప్పుకొనియుండునా? కేతనకవి తన దశకుమారచరిత్రమునందు తిక్కన సోమయాజి తాతయైన మంత్రి భాస్కరుని నిట్లభివర్ణించి యున్నాడు.

"శా. శాపానుగ్రహశక్తియక్తుడమలాచారుండు సాహిత్యవి
ద్యాపారీణుడు ధర్మమార్గపథికుండర్థార్థి లోకావన
వ్యాపారవ్రతుడంచు జెప్పు సుజనవ్రాతంబు గౌరీపతి
శ్రీపాద ప్రవణాంతరంగు విబుధ శ్రేయస్కరున్ భాస్కరున్."

కేతనకవి ఈ భాస్కరమంత్రి గ్రంథరచన చేసినటుల జెప్పకపోయినను "శాపానుగ్రహ శక్తియుక్తుడు" అనియు, "సాహిత్య విద్యాపారీణుడు"అనియు, చెప్పుటచేతనే యతడు కవియైనటుల నూహింపవచ్చును. ఇంక గుంటూరివిభుత్వమును గూర్చి కొంచెము చెప్పవలసియున్నది. "ఏ కాలమునందు మంత్రి భాస్కరుడుండెనని ప్రతిపక్షులు తలంచుచున్నారో యా కాలమున గుంటూరును బరిపాలించుచున్న ప్రభుడొకడు కలడని శాసనముల వలన దెలియవచ్చుచున్నది. ఆ కాలమున గుంటూరు రాజ్యమునకు పాలకుడు శ్రీమన్ మహామండలీక గుంటూరి యుదయరాజు, అతని మంత్రి బొల్లన, సేనాని రాయనప్రెగడయు, నైనట్లుగా బెజవాడ మల్లేశ్వరస్వామి వారి యాలయ స్తంభమునగల శాసనమువలన దెలియవచ్చుచున్నది. ఈ శాసనమును బట్టి చూడగా గుంటూరు పాలకుడుగాని, మంత్రిగాని, సేనానికాని, మంత్రి భాస్కరుడు కాడని దోచుచున్నది."అని యొక విమర్శగ్రంథమున వ్రాయబడినది. ఈ శాసనము క్రీ.శ.1216వ సంవత్సరమున వ్రాయబడినది. ఈ శాసనము వ్రాయబడియన కాలమున దిక్కభూపాలుడు నెల్లూరు మండలమును బరిపాలించుచున్నవాడు. మంత్రి భాస్కరుని మూడవకుమారుడగు సిద్ధనామాత్యుడాతని కాప్తమంత్రిగ నుండెనని దెలిసికొనియుంటిమి. కాబట్టి మంత్రిభాస్కరుడింతకు పూర్వము నలువది, యేబది సంవత్సరముల