పుట:Andhrula Charitramu Part 2.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రిందట నుండియుండెను. అప్పు డీతడు గుంటూరునకు బాలకుడుగ నుండెనని నమ్ముట కేవిధమయిన యభ్యంతరముండును? ఉదయరాజునకు గాని, అతని పూర్వులకుగాని, బొల్లనమంత్రికి బూర్వము భాస్కరుడు మంత్రిగనుండియుండునని యేల తలంపరాదు? ఇంతకును నా శాసనములో నుదాహరింపబడిన మండలేశ్వరుడు "గొంటూరియుదయరాజు" అని పేర్కొనబడినంత మాత్రమున నాతడు గుంటూరి సీమకు బరిపాలకుడని యెట్లు సిద్ధాంతము చేయవచ్చును? కానిండు. సిద్ధాంతమైన దనుకొందము. బొల్లనయే కాని ఇతర మంత్రులెవ్వరు లేరని యెట్లు నిర్ధారణ సేయవచ్చును? వట్టికుతర్కముల వలన బ్రయోజనము లేదు. భాస్కరుని తండ్రి కేతన కమ్మనాటిని బరిపాలించుచుండిన త్రిభువనమల్ల దేవ చోడ రాజునకు మంత్రిగనుండెను. భాస్కరుని మూడవకొడుకు సిద్ధనామాత్యుడు తిక్కజననాథశిఖామణికి నాప్తమంత్రియు, సేనాపతియునై యుండెను. కొమ్మనామాత్యుని పుత్త్రుడు తిక్కనసోమయాజి మనుమసిద్ధి రాజునకు సేనాధిపతిగనుండెను. తండ్రులును, తమ్ములును, కొడుకులను, మనుమలను, మంత్రిత్వాదిపదవులను వహించియుండగా మంత్రి భాస్కరుడు సామాన్య గృహస్థుడని నమ్మించుటకై ప్రయత్నపడుట మిక్కిలి శోచనీయము. ఇంతియగాక కేతనకవి తన దశకుమారచరిత్రమున విక్రమసింహపురవర్ణనమును, తత్పురాధీశ్వరుండగు మనుమసిద్ధి మహీవల్లభునకు గరుణారసపొత్రంబైన కొట్టరువు తిక్కనామాత్యుడు నిజకుల మాగతం బగు మంత్రిపదంబున వర్తిల్లుచు,

"గీ. అందలంబు గొడుగులడపంబు మేల్కట్టు
చామరములు జమిలిశంఖములును
గంబగట్లు భూమికానికగా గబెం
వెసగు రాచపదువులెల్ల బడసె."

అని మంత్రిపదంబు నిజకులక్రమాగతం బయిన దని నుడివి యున్నాడు.