పుట:Andhrula Charitramu Part-1.pdf/404

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యణ మహాభారతములు కళింగదేశమును బేర్కొనియున్నవి. పాణిని తనవ్యాకరణ సూత్రములయందు గళింగము నుదాహరించియున్నాడు. రఘువంశాదికావ్యాములలో గళింగ మభివర్ణింపబడినది. కళింగాంధ్రములు రెండును నేడు గలిసియున్నను పురాతనకాలమున వేఱ్వేఱుగనుండినవి. అయిన నన్యోన్యమైత్రియు అన్యోన్యసంబంధ బాంధవ్యములను గలిగి సఱలుచుండినవి(?). దక్షిణాపథమునకువచ్చుటకు ముందార్యులీదేశమునకు వచ్చియుండిరి కాని యాకళింగార్యులను భ్రష్టులనుగా భావించియుండిరి. కళింగదేశము బుద్ధునికాలమునందే బుద్ధధర్మమును స్వీకరించి బుద్ధునికడుగులు మడుగులొగ్గుచుండినట్లుగ గన్పట్టుచున్నది. ఆర్యులాంధ్ర ద్రావిడమహారాష్ట్ర దేశములవలెనె కళింగదేశమును భ్రష్టమైనదిగాను మ్లేచ్ఛదేశముగాను భావించుచుండిరి. సుప్రసిద్ధమైన మహేంద్రపర్వత మీదేశముననున్నది. ఈ దేశము దంతావళములకు బ్రసిద్ధికెక్కియున్నది. పూర్వకాలంబున కళింగదేశము ప్రసిద్ధములయిన రేవుపట్టణమును గలిగి యుండుటచేత దీనికిని విదేశములకును వర్తకవ్యాపారములు విరివిగా జరుగుచుండెను. కళింగరాజులకును సింహళరాజులకును సంబంధ బాంధవ్యములు నన్యోన్యమైత్రియుగలవని బౌద్ధులచరిత్రములు వేనోళ్లఘోషించుచున్నవి. కాబట్టి కళింగదేశము యొక్క ప్రాచీనస్థితి ప్రఖ్యాతమైనదనుటకు సందియములేదు.

అడవియేనుగులను మచ్చికచేసికొనుటయందును తత్వశాస్త్రపఠనమునందును కాళింగులు బహునిపుణులనియును నాగరికులనియును క్రీ.పూ.302 వ సంవత్సరప్రాంతమున మౌర్యచక్రవర్తియగు చంద్రగుప్తుని యాస్థానమందుండిన మేగస్తానీసను యవనరాయబారి వ్రాసియున్నాడు మఱియు నఱువదివేల కాల్బలమును, ఒక వేయి యాశ్వికబలమును ఏనూఱులు దంతావళములు రాజనకు రక్షకసైన్యముగ నుండెననియుంజెప్పియున్నాడు. క్రీ.పూ.260 దవసంవత్సరమున చంద్రగుప్తుని మనుమడగు అశోకవర్థనమహాచక్రవర్తి కళింగదేశముపై దండెత్తివచ్చి కళింగమునుజయించెను. కాళింగులు వెనుదీయక మహాపౌరుషముతో నెదుర్కొని వానితో యుద్ధముజేసి లక్షలకొలది రణభూమి