శాసనములలో బురాతనమైనదిగనున్నది. ఇందు జెప్పబడిన మహిష్మతీనగరము కార్త్యవీర్యుని వంశములోనివాడగు ప్రతీపునికిరాజధానియై రేవానదీతటంబుననున్నదని రఘువంశమునందు జెప్పబడినది. నర్మదానదీతటంబున నున్న మండ్లయును గ్రామమే పూర్వము మహిష్మతీనగరము గానుండెనని జనరల్ కన్నిహ్యామ్ గారు వ్రాయుచున్నారు. [1] మహిష్మతీనగరము నర్మదాతీరుము నందున్నదని డాక్టరు భాండార్ కర్ గారుకూడ వ్రాయుచున్నారు.[2] కోనముమ్మడిరాజుయొక్క రాణియగు రాజుదేవి శాలివాహనశకము 1057వ సంవత్సరములో జేసిన దానశాసనము మఱియొకటిగలదు. ఈ ముమ్మడిరాజు రాజేంద్రచోడునికి బెద్దన్నయగు రెండవముమ్మడి భీమరాజుగనుండెను. మఱియును వీనితోగూడి పరిపాలనముచేసిన మొదటి సత్యరాజుయొక్క శాసనముగూడ గలదు. ఈ సత్యరాజుకోనరాజపఱేడునుకు తొండాంబికయందు జనించినవాడును రాజేంద్రచోడునకు దమ్ముడునై యుండెను.
ఈ మొదటి సత్యరాజునకు దరువాతి రాజ్యాధిపత్యమును వహించిన వానికొడుకు మూడవభీమరాజు వేగి విషయాధీశ్వరుడయిన రాజరాజునకు లోబడిన సామంతుడగ నుండెనని రాజరాజదేవుని రాజ్యకాలములోని తొమ్మిదవ సంవత్సరమున ననగా శాలివాహన శకము 1075 దవ సంవత్సరములో కోనసత్యరాజు యొక్క కుమారుడును మహామండలేశ్వరుండు నైన భీమరాజుచేవ్రాయించబడిన శాసనమును పట్టి దెలియుచున్నది.
మఱియును కోనమల్లి దేవరాజు రాణియగు గంగాదేవి వలన శాలివాహనశకము 1077వ సంవత్సరములో నొక దీపము దానము చేయబడినట్లుగా దెలిపెడి శాసనమొకటియు కోనమల్లిదేవరాజుతో గలిసి పరిపాలనముచేసిన రెండవమనుమసత్యరాజుమంత్రి గూడనొకదీపమును దానము చేసెనని దెలిపెడి దానశాసనమొకటియు నాదేవాలయమునందే గాన వచ్చుచున్నవి.