పుట:Andhrula Charitramu Part-1.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతియగాక పాలకొలను గ్రామములోని క్షీరారామేశ్వరుని దేవాలయములో నిటీవల వ్రాయబడిన శాసనములు కొన్ని యీవంశములోని మఱియిద్దఱు రాజులపేరులను బేర్కొనుచున్నవి. వారినామములకు ముందు కోనశబ్దము ప్రయోగింపబడియుండుట చేత నీ యిరువురు గూడ కోనసీమరాజులలోని వారేయని నిశ్చయింప బడియెను. అందొకరు కోనగణపదేవమహారాజనువారు మఱియొకరు కోనభీమవల్లభరాజనువారు. వీరిలో మహామండలేశ్వర గణపదేవ మహారాజుగారి దేవియగు నుదయమహాదేవి చాళుక్య వంశజుడును విష్ణువర్ధన మహారాజబిరుదాంకితుండును, నిడుదప్రోలు (నిడదవోలు రాజమహేంద్రవరమునకు బడమట 10 మైళ్లదూరమున నున్నది.) పురాధీశ్వరుండు నైన మహాదేవచక్రవర్తి కొమార్తెయైయుండెను. ఈ మహాదేవ చక్రవర్తి శాసనములు శాలివాహనశకము 1218 వ మొదలు కొని 1022 వఱకును వానియల్లుడగు గణపతిదేవ మహారాజుయొక్క శాసనములు శాలివాహనశకము 1184 మొదలుకొని 1022 వఱకును, గానిపించుచున్నవి. భీమవల్లభరాజుయొక్క దానశాసనములు రెండింటిలో నొకటి శాలివాహనశకము 1240దవ సంవత్సరమున వ్రాయబడినది. కాబట్టి వీరలిరువురును కాకతీయులైన గణపతిరాజులకు సామంతులుగ నుండి కోనసీమరాజ్యమును బరిపాలించిరని చెప్పవచ్చును.

---<>- - -