పుట:Andhrula Charitramu Part-1.pdf/357

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇతడు 1092-93 వ సంవత్సరము వఱకు బరిపాలించినతరువాత వీని స్థానము నకు వీరచోడునితమ్మడగు విక్రమచోడుడు నియమింపబడియెను. ఇతడు 1117వఱకును వేంగిదేశమును బాలించెను. తరువాత గొంతకాలము వెలనాటి చోడులు రాజప్రతినిధులుగ వేగిదేశమును బరిపాలించిరి.

వీరచోడుడు.

కులోత్తుంగుని మూడవకుమారు డయినవీరచోడుడు విష్ణువర్ధనుడను నామముతో వేంగిదేశమును 1087 మొదలుకొని 1084వఱకును 1088-89మొదలుకని 1092-93వఱకును బరిపాలనము జేసినటుల టేకి , పిఠాపురము శాసనములబట్టి నిర్ణయింపవచ్చును. ఇతడు వేగిదేశమునకు రాజప్రతినిధిగ నున్న కాలమున వెలనాటి ప్రభువయిన మొదటి చోడగొంకరాజుయొక్క సోదరపుత్రుడయిన రెండవ విదురుడు మంత్రిగనుండెను. ఈ విదురరాజు తనయాజ్ఞ ప్రకారము పాండ్యరాజు నొకని జయించుటచేత మెచ్చుకొని తనరాజ్యములోని యర్థభాగమగు సింధుయుగ మంతరదేశమును (కృష్ణాగోదావరుల మధ్యదేశమును) వీరచోడుడు బహమానముగ నొసంగెనట. వీరచోడుని శాసనములనేకములు గలవు.

మేడమార్యుడు.

ఈ మేడమార్యుడమబ్రాహ్మణోత్తముడు వీరచోడునియొక్క ముఖ్యసేనాధిపతిగనుండెను. ఇతడు ముద్గలగోత్రజాతుడయిన పోతనార్యనికి కన్నమాంబయందుజనించిన పుత్రరత్నము, పోతనార్యునియందుగల గుణాధిక్యతచేత రాజరాజువానిని బ్రాహ్మమహారాజని పిలుచుచుండెనట. అందుచేత జనులు వానిని రాజరాజబ్రహ్మమహారాజను బిరుదునామముతో సమ్మానించుచుండిరట. మేడమార్యుడు తనయొక్క సుగుణములచేతను బుద్ధివిశేషముచేతను రాజానుగ్రహము బడసి మహోన్నత పదవికి వచ్చెను. ఇతడు వేదవేదాంగవేదియగుటయే గాక ధనుర్వేదపారంగతుడు, భుజబల పరాక్రమసంపన్నుడు. రాజనీతివేత్తయు నగుటచేత వీరచోడుడు వీనికి సేనాధిపత్యము నొసంగెను.