Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్పష్టమనగా జెప్పియుండుటయె నన్నయభట్టారక చరిత్రమునందలి యుక్తులన్నియు గాలికి దూదిపింజె లెగిరిపోవునట్లెగిరిపోవుచున్నవి. నన్నయకాలమునందే యాంధ్రకవులనేకులు ప్రసిద్ధికెక్కియున్నారు. వారిలో నారాయణభట్టొకడుగ నున్నాడు. నారాయణభట్టు తనకీకార్యమునందు దోడ్పడినట్లుగా నీక్రిందిపద్యమున నన్నయభట్టే చెప్పియున్నాడు.

"ఉ. పాయకసాకశాసనికి భారత ఘోరరణంబునందు నా
రాయణునట్లు, తానును ధరామరవిభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయధురంధరుడం దనకిష్టుడు న్సహా
ధ్యాయుడునైన వాడభిమతంబుగదోడయి నిర్వహింపగన్."

నారాయణభట్టు,

నందమపూడి శాసనము.

"నన్నయలిఖితమైన యొకశాసనమున నారాయణభట్టు కర్ణాటకభాషయందు బండితుడని తెలుపబడియున్నదిగావున నీ కన్నడపండితుని సహాయముచే శబ్దమణిదర్పణపద్ధతిని మనయాంధ్రమును భట్టారకులవారు శాసించి"రని నన్నయ భట్టారకచరిత్రమునందలి కల్పితవాక్య మాంధ్రప్రపంచముయొక్క సంపూర్ణవిశ్వాసమును పెడత్రోవను బట్టించుచున్నది గనుక దానినెంతమాత్రమును విశ్వసింపరాదు. ఒక్క కర్ణాటక పండితుడని మాత్రమునన్నయలిఖితమైన శాసనమునందు దెలుపంబడియుండలేదు. నన్నయలిఖితమని చెప్పబడుశాసనము నందమపూండి (నందంపూడి -ఇది ప్రస్తుతపు కృష్ణామండలములో తణుకుతాలూకాలోని సెట్టిపేటకు సమీపమున నెఱ్ఱకాలువయెడ్డునున్నది) శాసనమేగాని మఱియొకటిగాదు.

[1] సింధుయుగమంతరదేశమను నామాంతరముగల రెండేఱులవాడి విషయములోని యీ నందమపూండి గ్రామమును చంద్రగ్రహణ పుణ్యకాలమున రాజరాజనరేంద్రుడు తన ముప్పదిరెండవ పరిపాలన సంవత్సరముననగా (బహుశ) శాలివాహనశకము 975వసంవత్సరమ మార్గశిరశుద్ధ15భా

  1. Ep.Ind Vol. IV, pp. 300-309, No. 43.