బిరుదునామములను వహించి యాంధ్రదేశమునందతట బ్రఖ్యాతి వహించెను, ఈ బ్రాహ్మణప్రభువు మనోవాక్కాయ కర్మంబుల బరిశుద్ధుడయిన కుండిన ఋషీంద్రుని వంటివాడట, మఱియు శివభక్తుడు. యజ్ఞయాగాది క్రతువుల నాచరించినకర్మిష్ఠి. ఔదార్య చిత్తముగలవాడు. ఇతడు తన ప్రజ్ఞావిశేషముచేత విమలాదిత్యుని పరిపాలనము జయప్రదమైనదిగా జేయుటకు బహుకష్టపడినందున విమలాదిత్యుడు సంతోషించి వాని ప్రభుభక్తికి మెచ్చుకొని గుద్రవాడి విషయములోని పాఱువళమను గ్రామముతో గూడ రణస్థిపూండిగ్రామము నగ్రహారముగా నేర్పాటు చేసి దానముచేసెను. ఈ రణస్థిపూడి గ్రామముచుట్టును మ్రొంతకఱ్ఱు (మోడేకఱ్ఱు) లుల్ల (లొల్ల), సిరిపొడపూండి (పెదపూడి) చింతగుంట, పెంజెఱువు మొదలగు గ్రామములు పేర్కొనబడియుండుటచేత ఈరెండు గ్రామములు గోదావరిమండలములోని అమలాపురము తాలూకాలోనివిగా గన్పట్టుచున్నవి. పాఱువళగ్రామ మమలాపురము కాలువయొడ్డున నున్న పలివెల గ్రామముగానున్నది. ఈశాసనమును వ్రాసినవాడు భీమనభట్టు.
రాజరాజవిష్ణువర్ధనుడు.
ఆంధ్రదేశమును బరిపాలించిన పూర్వరాజులలో నీరాజరాజ విష్ణువర్ధనుడు మిక్కిలి యదృష్టవంతుడని చెప్పదగియున్నవాడు. తమ భుజబల పరాక్రమముచేత దక్షిణహిందూదేశమునంతను జయించి శత్రుజనభయంకరులైయుండిన చోడరాజులకు నితడు రక్తబంధువగుటంజేసి పరరాజులెవ్వరును వీనినిగాని వీని రాజ్యమునుగాని మార్కొన సాహసింపజాలకుండిరి. అందువలన నాంధ్రదేశమునకు శాంతియును, వీనికి మనస్స్వాస్త్యమును లభ్యములయ్యెను. వీనితండ్రియగు విమలాదిత్యడు రాజరాజచోడుని కూతురును రాజేంద్రచోడునిచెల్లెలు నగుకూండవాంబాదేవిని వివాహమాడెనని యింతకు బూర్వము దె