పదునాలుగవ ప్రకరణము.
విమలాదిత్యుడు.
ఈ విమలాదిత్యుడు దానార్ణవునికి నార్యమహాదేవివలన జనించిన ద్వితీయపుత్త్రుడు. శక్తివర్మ తమ్ముడు. శక్తివర్మ తరువాత నితడు 1015వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి 1022 వఱకు నేడు సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసియుండెనని కొన్ని శాసనములు స్పష్టముగా దెలుపుచున్నవి గాని విమలాదిత్యునిచే బ్రకటింపబడిన రణస్థిపూడి శాసనము శాలివాహనశకము 933 సంవత్సరము జ్యైష్ఠశుద్ధ పంచమీ గురువానరంబున పుష్యమీ నక్షత్ర సింహలగ్నమునందనగా క్రీస్తుశకము 1011వ సంవత్సరము మే నెల 10వతేదీని పట్టాభిషిక్తుండయి నటుల దెలుపుచున్నది.[1]
ఇట్టి భేదమునకు గారణమేమో మనము దెలిసికొనవలసియున్నది. విజయనగరమునకు సమీపము నందుండిన రామతీర్థము కడనున్న కొండమీద లిఖింపబడిన యొక శాసనము చాలమట్టుకు శిథిలమై పోయినను ముమ్మడి భీముని పేరు కలిగియుండెను. [2] ముమ్మడి భీముడనునది విమలాదిత్యుని బిరుదునామములో నొక్కటియగుటచేత విమలాదిత్యుడు కళింగదేశమును జయించి యుండవచ్చునని కొందఱు తలంచుచున్నారు. పూర్వచాళుక్యలకును వెలనాటి చోడులకును లోబడి కోనమండలమేలిన హైహయవంశజులలో ముమ్మడిభీముడను వాడొకడుండుట చేత కేవలము పేరును బట్టి యే యది విమలాదిత్యుని