ఈ పుట ఆమోదించబడ్డది
శక్తివర్మ.
ఇతడు దానార్ణవుని జ్యేష్ఠపుత్రుడు. తంజాపురాధీశ్వరుండును చోడరాజునగు రాజరాజ రాజకేసరి వర్మతోడ్పాటుతో వేంగిరాష్ట్రమునకు బట్టాభిషిక్తుడై శక్తివర్మ 999 మొదలుకొని 1011 వ సంవత్సరమువఱకు పండ్రెండుసంవత్సరములు రాజ్యపరిపాలనము చేసి విశేషకీర్తి సంపాదించెను. వీనికి చాళుక్యచంద్రు డన్న బిరుదునామముగలదు. వీనిబంగారునాణెములుకొన్ని అరకాసు, నయాము మొదలగు ప్రదేశములందు గానిపించినవి. వాని బిరుదునామము లానాణెములపై నుండుటచేత నయ్యవి శక్తివర్మకాలమునాటివిగా నిర్ధారణము చేయబడినవి. వీనిబిరుదు పేరుగల బంగారు నాణెములాదేశములగన్పట్టుటచేత వీనికాలమునం దాంధ్రదేశమునకును పైజెప్పిన దేశములకును వర్తకవ్యాపారములు జరుగుచుండి యుండవలయును. ఆంధ్రులు మొదటినుండియు సముద్రయానము జేయుచు విదేశములతోడ వాణిజ్యాదివ్యాపారములు నడుపుచుండిరనుటకు లేశమాత్రమును సందియము బొందవలసినపనిలేదు.