మిక్కిలి ప్రఖ్యాతికెక్కినదిగ గానిపించుచున్నది. ఈ దిమిల ప్రాంతప్రదేశము దిమిలిసీమగా నేర్పడినది. [1] ఈ విషమసిద్ధి విష్ణువర్ధనుని మఱియొక శాసనము గుంటూరుమండలములోని చెజ్జరాలయను గ్రామమునందు గానుపించినది.[2] ఈ శాసనములనన్నిటిని బరిశోధించిచూచిన నీతని రాజ్యము గంజాముజిల్లా మొదలుకొని నెల్లూరివఱకును వ్యాపించియుండినటుల గన్పట్టుచున్నది. వీనిరాజ్యమునకు నుత్తరమున కళింగగాంగులును దక్షిణమున గాంచీపురపల్లవులును, ఆంధ్రచోడులును,ఆంధ్రబాణులును, పశ్చిమంబున బశ్చిమ చాళుక్యులును రాష్ట్రకూటులును బరిపాలనము సేయుచుండిరి. కుబ్జవిష్ణువర్ధనునితో నీదేశమునకు బట్టవర్థన వంశజుడయిన కాలకంపుడనువాడు వెంబండించివచ్చెను. ఇతడు విష్ణువర్ధనునకు దళవాయిగనుండెను. ఇతడు జైనుడుగ గన్పట్టుచున్నాడు. ఈ దళవాయి దద్దరయను రాజును జయించెను. వీనిసంతతివారు చాళుక్యులుకడ మంత్రులుగను సేనాధిపతులుగనుండి సమ్మానములను గాంచుచుండిరి.
జయసింహవల్లభమహారాజు.
కుబ్జవిష్ణువర్ధనుని తరువాత రాజ్యమునకు వచ్చినవాడతని జ్యైష్ఠపుత్రుడగు జయసింహుడు. ఈ జయసింహవల్లభ మహారాజు 633 వసంవత్సరము మొదలుకొని 663 వ సంవత్సరమువఱకును ముప్పదేండ్లు రాజ్యపరిపాలనము చేసెను. వీనికోరికలన్నియును సిద్ధించినవి గావున వీనికి సర్వసిద్ధియను నామము గలిగెను. వీనికాలముననే దిమిలి విషయములో సర్వసిద్ధియను పట్టణము గట్టబడినదిగా గాన్పించుచున్నది. ఇయ్యది పూర్వమొక ప్రఖ్యాతమైన పట్టణముగానుండెననుటకు సందియములేదు. ఇప్పడిది విశాఖపట్టణమండలములోని యెల్లమంచిలికి నైదున్నర మైళ్లదూరములోని చిన్నగ్రామముగానున్నది. ఈ గ్రామమునందు 1861వ సంవత్సరమము వఱకు తాలూకాకచేరియుండుటచేత