పిష్ఠపుర (Pithapuram)దుర్గము శత్రువులకు దుస్సాధ్యమైనదిగ నుండెను. ఈ చాళుక్యులు పిష్ఠపురదుర్గమును ముట్టడించి స్వాధీనము జేసికొనిరి. ఇట్ల కళింగమును వేంగిని వశపఱచుకొని శ్రీసత్యాశ్రయ పృథ్వీవల్లభమహారాజు పల్లవనాయకుని కాంచీపురదుర్గములో దలదాచుకున్నట్లు చేసెనని అయిహోలె శాసనమున బేర్కొనబడినది.[1] ఈ శాసనములోని వాక్యమునుబట్టి పిష్ఠపురమును బాలించుచుండినది పల్లవులని తేటపడుచున్నది. ఈపులకేశి రెండవతమ్ముడయిన విష్ణువర్ధనుని దనకు బ్రతినిధిగానుండి కళింగవేంగి దేశములను బరిపాలనము చేయవలసినదిగా నియమించి తనదేశమునకు వెడలిపోయెను. ఈ విష్ణువర్ధనుడే తరువాత స్వతంత్రుడై మొదటివిష్ణువర్ధనుడను పేరుతో వేంగిరాష్ట్రమును బరిపాలించి పూర్వచాళుక్యవంశస్థాపకుడయ్యెను.
ఆంధ్రచాళుక్యులు.
కుబ్జవిష్ణు వర్ధనమహారాజు.
ఆంధ్రచాళుక్యలలో మొదటివాడయిన యీ విష్ణువర్ధనుడు మఱుగుజ్జుగనుండుటచేతను గాబోలు నీతనిని కుబ్జవిష్ణువర్ధనుడందురు. ఆంధ్రదేశమును బాలించిన విష్ణువర్ధనులలో నితడు మొదటివాడు. ఇతడు మొదట యువరాజుగనుండి మహారాష్ట్ర దేశములోని సతారా పంఢరపురమండలములను బరిపాలించుచుండెను. భీమరథీతటమున నొక గ్రామమునుబ్రాహ్మణులకు దానము చేసెనని తెలిపెడి దానశాసనమొకటి సతారాలో గాన్పించినది. [2]
సత్యాశ్రయుడు కళింగమును వేంగినిజయించిన తరువాత పరిపాలకుడుగా నియమింపబడి స్వతంత్రుడై 615వ సంవత్సరమున చైత్రశుద్ధపూర్ణిమ తరువాత మహారాజ పదవిని గాంచి 633వ సంవత్సరమువఱకును పదునెని