పుట:Andhrula Charitramu Part-1.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగళేశుని మరణానంతరము నదివఱకు మంగళేశుని పరాక్రమమునకు వెఱచి యణగియుండిన శత్రురాజులందఱును విజృంభించి పులకేశిపై దండెత్తిరి. ఆ యుద్ధములలో బులకేశియు వాని సైన్యములు నసమానాద్భుత శౌర్యపరాక్రమశక్తులను జూపుటచేత గొందఱు పలాయనులయిరి. అధికశౌర్యవంతుడును రాష్ట్రకూటరాజును నగు గోవిందరాజు పులకేశిని శరణువేడెను. పులకేశి వానిని మిత్రునిగా జేకొనివానికి ననేక బహుమానములొసంగెను. పిమ్మట నాతడు వనవాసిని ముట్టడించి కదంబులను జయించి వశపఱచుకొనియెను. చేరదేశమును బాలించుగాంగులు వశులయిరి. తరువాత కొంకణదేశములోని మౌర్యులపై దాడి వెడలి వారిని సులభముగా లోబఱచుకొనియెను. నూఱుయోడలతో బయలుదేఱి సముద్రలక్ష్మియని పిలువబడుచుండిన సముద్రతీరమునందలి పూరియనుపట్టణమును ముట్టడించెను. ఇది పూర్వము మౌర్యులకును దరువాత శిల్హారరాజులకును రాజధానిగనుండెను. తరువాత లాటమాళవమూర్జరరాజులు వానిచే జయింపబడి కప్పములు గట్టుచుండిరి. ఇక్కాలమున నుత్తరహిందూదేశమునగన్యాకుబ్జము రాజధానిగ జేసికొని యుత్తర హిందూదేశమునంతనుజయించి సార్వబౌముడైయుండిన హర్షవర్ధనుడు దక్షిణదిగ్విజయయాత్రకు బయలువెడలినప్పుడు పులకేశి యెదుర్కొని వానిని క్రిందికిరానీయక వానిమనోరథమును భగ్నము గావించెను. అంతటినుండి పులకేశి రాజపరమేశ్వరుడన్న బిరుదాభిదానమును వహించెను. వీనిసంపూర్ణమైన నామము సత్యాశ్రయ శ్రీపృథ్వీవల్లభమహారాజనునదిగానుండెను. ఇతడు మహారాష్ట్రకములనియెడు మూడురాజ్యములకు ప్రభువయ్యెను. సర్వవిధములచేతను చాళుక్యులలో బహుసమర్థుడుగానుండెను.

పూర్వదిగ్విజయయాత్ర.

ఇతడాఱవశతాబ్దాదిని బహుసేనలంగూర్చుకొనిపోయి దక్షిణకోసలమును జయించి కళింగవేంగిదేశములపై దండెత్తివచ్చి మొట్టమొదట పిష్ఠపురమును ముట్టడించెను. ఈతని దండయాత్రలో నీసత్యాశ్రయపులకేశివల్లభునికి గనిష్ఠసోదరుడును యోధవరుడునగు విష్ణువర్ధనుడుగూడ నుండెను. ఆ కాలమునందు