పుట:Andhrula Charitramu Part-1.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రమున జాళుక్యవంశమున హరితుడు మానవ్యుడునను వీరులు జనించి ప్రసిద్ధులయిరనిన పేర్కొనబడియుండెను. ఆంధ్రభృత్య వంశములో జేరిన "గోతమిపుత్త్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్త్ర శాతకర్ణి, మాధారిపుత్త్ర శకసేనుడు" అను వారి పేరుల రీతిగానే హారితిపుత్త్ర శాతకర్ణియను పేరులోని హారితిశబ్దము స్త్రీ వాచకమైయుండెను.హారితిశబ్దము హారిత శబ్దముగా మార్చుట చిత్రముగానున్నది. చాళుక్యులుత్తరముననున్న కాలమునగూడ హారితపుత్త్రులను పేరు గలిగియున్నట్లుగ విజయవర్మ యొక్క కైరా శాసనము చాటుచున్నది. అలహాబాదు ప్రాంతముననున్న రీవాలోని యొక శాసనము మహీపాలుని నామమో లేక మఱియొక విడి మనుజుని పేరో తెలియదు గాని హరితిపుత్త్ర శౌనకుడని యొక నామమును పేర్కొనుచున్నది. ఈ శాసనము క్రీస్తునకు పూర్వము రెండవ శతాబ్దలోనిదిగ నొకరు చెప్పియున్నారు గాని డాక్టరు బర్గెస్సుగారంత పూర్వపు శాసనముకాదని యభిప్రాయపడియున్నారు. [1] ఈ చిత్రమైన సంబంధమునుబట్టి చూడగా జాళుక్యులు గూడ దక్షిణాపథములోని వారేనని యయోధ్యనుండి వచ్చిన వారు గారనియు, ఆంధ్రపహ్లవ సంయోగము వలన జనించిన పల్లవులనియెడి సంకీర్ణజాతి వలెనె ఆంధ్రశక సంయోగము వలన జనించిన యొక సంకీర్ణజాతిగా నుండనోపుననియు, ఇట్లు హిందూమతావలంబులయిన పల్లవులును చాళుక్యులును తాము సంకీర్ణ జాతుల వారమని తెలియబడకుండ దమజాతి శ్రేష్ఠత్వము నిరూపించుటకై యార్యక్షత్రియులమని పౌరాణిక క్షత్రియ వంశములతో దమ వంశములను బంధించి చంద్రవంశజులమని జెప్పుకొనసాగిరని మా యభిప్రాయము. పదునొకండవ శతాబ్దమునందలి చాళుక్యుల శాసనములలో మాత్రమె పౌరాణిక వంశవృక్షము గల్పింపబడినది గాని యంతకు బూర్వపు శాసనములలో గానరాదు. పూర్వచాళుక్య శాసనములలో రణస్థిపూడి, కోరుమిల్లి చెల్లూరు శాసనములలో బౌరాణిక వంశము వివరముగా వర్ణింపబడినది. ఈ శాసనములలో రణస్థిపూడి శాసనము విమలాదిత్యునిచే వ్రాయబడినది గావున దక్కిన వానికంటె బూర్వమునందుండినది. ఈ శాసనమును

  1. Dr.Fleet's Karnatic Dynasties., p.9