వ్రాసినవాఁడు భీమనభట్టను బ్రాహ్మణుఁడు గావునఁ బౌరాణిక వంశవృక్షమును మొదట గల్పించినవాఁ డితఁడేయై యుండవలయునని కొందఱు తలంచుచున్నారు.
చాళుక్యవంశము.
జయసింహవల్లభమహారాజు.
ఇతఁడు విజయాదిత్యుని కుమారుఁడనియు విష్ణుభట్ట సోమయాజివలనఁ బెంపఁ బడి విష్ణువర్ధనుఁడను నామమును వహించి యుక్తవయస్సు వచ్చిన తరువాత చళుక్యపర్వతమునకుఁబోయి గౌరినిగూర్చి తపస్సు చేసివచ్చి కొంతసేనను గూర్చుకొనిపోయి కదంబులను గాంగులను, రాష్ట్రకూటులను యుద్ధములోనోడించి రాష్ట్రకూటరాజయిన యింద్రుని నుక్కడించి వాని రాజ్యమును గైకొని వాతాపినగరము రాజధానిగాఁ బరిపాలనముచేయనారంభించెనని యిదివఱకె దెలిపియుంటిమి. ఈజయములవలన నే యీతనికి జయసింహుఁడను బిరుదు నామముగలిగినది. ఈజయసింహుఁడు కాంచీపురాధీశ్వరుండయిన పల్లవరాజు కొమార్తెను వివాహముఁ జేసికొని యామెవలన విజయాదిత్యుఁడను కుమారుని గాంచెను.
రణరాగుఁడు.
ఈ విజయాదిత్యుఁడు బహుపరాక్రమవంతుఁడై పరరాజులతో యుద్ధములుసలుపుచు రణరాగుఁడను బిరుదును గాంచెను. వీనికిఁ బులకేశివల్లభుఁడను కుమారుఁడు కలిగెను.
శ్రీపులకేశివల్లభ మహారాజు.
ఇతఁడశ్వమేధాది యాగములఁ బెక్కింటి నాచరించి విశేషకీర్తి సంపన్నుఁడయ్యెను. మఱియును వాతాపి నగరమును పునర్నిర్మాణముఁ గావించి రాజధానిగఁ జేసికొని పరిపాలించెను. ఈ చాళుక్యవంశమునఁ బ్రఖ్యాతిఁగాంచినవారిలో మొదటివాఁ డీతఁడేయని తోఁచుచున్నది. వీని తరువాతి శాసనములన్నియు వీని పేరుతో వంశము వర్ణించుటకుఁ బ్రారంభించుచు వచ్చినవి. సత్యాశ్రయ