Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈనలంబవాడి పల్లవరాజ్యములో నిప్పటి బల్లారిమండలములో నధికభాగమును మైసూరునకు త్తరభాగమును ఈశాన్యభాగమును జేరియుండినవి. ఈ రాజ్యమునకు మొదట అనంతపుర మండలములోని హేమావతి రాజధానిగ నుండెను. అదియిప్పటి పెంజేరు లేక హెంజేరు అనుగ్రామముయొక్క ప్రాచీననామమైయున్నది. నలంబులుతా మీశ్వరవంశజులమనియు త్రినయన పల్లవుని వంశములోని వారమనియును జెప్పుకొనుచుండిరి. ఈ త్రినయన పల్లవుడు విజయాదిత్యుడను చాళుక్యరాజువలన నోడింపబడిన త్రిలోచన పల్లవుడేయని నిర్దేశింపబడుచున్నాడు. ఈ నలంబుల చరిత్రమును మైసూరు గెజటీరను గ్రంథమునందు రైసుదొరగారు కొంతవఱకు దెలిపియున్నారు. ఈనలంబవాడి రాజవంశముయొక్క ప్రాచీన వృత్తాంతము తొమ్మిదవ శతాబ్దమునాటిదిగ నున్నది. బాణవంశమును నాశముజేసితినని బడాయిగొట్టుకొనిన మహేంద్రాధిరాజనలంబుని శిలాశాసనమొకటి సేలము మండలములోని ధర్మపురియందు గనుగొనంబడినది. గాంగపల్లవులకాలములో పశువులను దొంగిలించెడివారని ద్రవిడచారిత్రములలో నలంబులు వర్ణింపబడియుండిరి. అట్టిగోగ్రహణములను గార్చి తెలిపెడు రెండుశాసనములు త్తరర్కాడు మండలములోని అంబురుకడగానిపించినవి. వేలూరునకు సమీపమున గానిపించినయొకశాసనములో వల్లవమురారియనియెడి త్రిభువనాధీరనలంబుని పేరుగానవచ్చుచున్నది. నలంబవాడిదాటి వీరియధికార మెంతవఱకువ్యాపించెనో పైశాసనములంబట్టియే గోచరము కాగలదు. పశ్చిమగాంగరాజగు రెండవమారసింహుడు (క్రీ.శ.963 మొదలు కాని 974 వఱకు) నలంబులనాశముజేసినట్లుగ గరువముతో జెప్పుకొనియెను. చోడరాజగు మొదటిరాజరాజు(985 మొదలుకొని 1013 వఱకు) నలంబపాడిని జయించినట్లగ జెప్పుకొనియున్నాడు. చాళుక్యులు కళ్యాణిపురమున బరిపాలనము చేయుచున్న కాలమునందు నలంబరాజులకు బల్లారిమండలములోని కంపిలియనుపట్టణము రాజధానిగ నున్నట్లు గన్పట్టుచున్నది. అభాగమున క్రీస్తుశకము 13 వశతాబ్దమువఱకు పల్లవులు గొంతవఱ కధికారమును గలిగియుండిరని శాసనములనుండి సాక్ష్యమును జూపవచ్చును.