Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంతుడని యూహింపబడుచున్నాడు అపరాజిత విక్రమవర్మ కడపటివాడుగా బరిగణింప బడుచున్నాడు. కుంబకోణమునకు సమీపము నందుండిన శ్రీపెరుంబీయమను ప్రదేశమున నితడు వరగుణుడను పాండ్యరాజు నోడించెను. తొమ్మిదవ శతాబ్దాంతమునందు ఆదిత్యుడను చోళరాజు చేత జయింపబడియెను. అంతటితో వీరి రాజ్యము చోడుల వశమయ్యెను. మైసూరుదేశములోని గాంగవాడి రాజులయిన పశ్చిమగాంగులును బాణులును గాంగపల్లవులకు లోబడినవారని చెప్పెదరు. బాణరాజులనుగూర్చి ప్రత్యేకముగ వేఱొక ప్రకరణమున వివరింతుము.

మఱియొక పల్లవవంశము.

గాంగపల్లవులతో గూడ మఱియొకపల్లవవంశము తొండైనాడులోని మఱియొక భాగమును బరిపాలించుచుండెను. వీరు నందివర్ణ పల్లవమల్లుని వంశములోని వారమని చెప్పుకొనుచుండిరి. తిరువళిక్కేణిశాసనమునందు దంతవర్మ మహారాజు పేరుగానంబడుచున్నది. నాలాయిర ప్రబంధములోని వైరమేముడు తొండై యారునకు రాజని చెప్పబడియెను. తెల్లరేరిండ నందిపోతరాయనిశాసనములు కాంచీపురములోను తంజావూరుమండలములోని కొన్ని గ్రామములలోను గానంబడుచున్నవి. పల్లవరతిలక వంశమునకు సంబంధించిన నందిపోతరాయరను మఱియొక పల్లవరాజుగలడు. ఈ రాజులకును గాంగపల్లవులకునుగల సంబంధము భావిపరిశోధనలవలన గాని గానరాదు. రాష్ట్రకూటరాజయిన మూడవ గోవిందరాజుచే జయింపబడిన దంతిగయను కాంచీపురాధీశ్వరుడు గాంగపల్లవ వంశములోని వాడోయైయుండవచ్చును.

నలంబవాడిపల్లవవంశము.

కడప, కందవోలు, బల్లారి, అనంతపురమండలము లొకప్పుడు పల్లవరాష్ట్రములో జేరియుండెనని యిదివఱకె తెలుపంబడియెను. పల్లవసామ్రాజ్యము విచ్ఛిన్నమైన తరువాత 3200 గల నలంబవాడి రాజ్యమేర్పడియెను.