మహానాదిర్మహాన్ ఘోర శ్రుతీనాం చాభిమానవాన్
జినానామంతక సాక్షాత్ గురుద్వేష్టాతి పాపవాన్.
ఇతడాంధ్రజాతివాడనియును, తైత్తరీయశాఖవాడనియును, ఈతనితండ్రి పేరు యజ్ఞేశ్వర భట్టనియనియును, ఈతని తల్లిపేరు చంద్రగుణాయనియును, ఈతడాంధ్రోత్కల సంయోగ ప్రదేశమనగా నిప్పటి గంజాము జిల్లాలో జయమంగలమను గ్రామమునందు జనించెననియును పైశ్లోకముయొక్క భావమైయున్నది. జైనులు తమ మతగ్రంథముల నితరులకు జూపనందున బూర్వాచార పరాయణుడైన యీమహావిద్వాసుడు జైనవేషము వేసికొని జినాచార్యులవద్ద నాజైన ధర్మతత్వములను నేర్చుకొని తరువాత జైనమత ఖండనము జేసినందున జైను లీతనని గురుద్రోహియనియు, పాపుడనియును నిందించెదరు. ఇతడు మహావాదియని వీని ప్రతిపక్షులయిన జైనులే యొప్పుకొనిరి. మఱియు నీతడు మేదినీపురరాజయిన సుధన్వుని శిష్యునిగ జేసికొని వానిచే బౌద్ధజైనుల ననేకుల జంపించెనని చెప్పెదరు కాని అదివాస్తవమైనను గాకపోయినను జైన బౌద్ధమతములడుగంటుటకు నితడు కొంతవఱకుగారకుడని చెప్పవచ్చును. జైమిని కృత మీమాంసపై నితడు వ్రాసిన భాష్యములో వర్ణింపబడిని సాంప్రదాయమునకు భట్టమతమని పేరుకలదు. వేదములో వర్ణింపబడిన యజ్ఞ యాగాదికర్మలు చేయుటవలన ముక్తికలుగునని కుమారిలభట్టు యొక్క సిద్ధాంతమై యున్నది గనుక నితడు కర్మమార్గవాదియని యుత్తరమీమాంసకు లనియెదరు. కుమారిలభట్టు రెండుశతాబ్దములకు బూర్వమే బౌద్ధజైనులపై దండెత్తి వాగ్యుద్ధములను సలుపుటవలన శంకరాచార్యునికి మార్గము సులభమయ్యెను.
బ్రాహ్మణులు-సముద్రయానము.
(క్రీ.శ. 405-411)
అయిదవ శతాబ్దారంభమున చీనాదేశస్థుడగు ఫాహియాన్ అను యాత్రీకుడొకడు బౌద్ధక్షేత్రములను సందర్శించుటకును బౌద్ధధర్మగ్రంథము