పుట:Andhrula Charitramu Part-1.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నభ్యసించు నిమిత్తమును హిందూదేశమునకు వచ్చియుండి యాఱుసంవత్సరములు దేశసంచారము చేసి హిందూదేశము యొక్క యాకాలపుస్థితిని గొంతవ్రాసిపెట్టినాడు. ఇతడు హిందూదేశమంతయు దిరిగిచూచిన తరువాత తామ్రలిప్తినగరమున నోడయెక్కి బహుదినములు ప్రయాణము చేసి సింహళద్వీపమునకు బోయి యచ్చట కొంతకాలము నివసించియుండి పిమ్మట వర్తకులదైన యొకయోడనెక్కి తొంబది దినములకు జావాద్వీపమును బ్రవేశించెను. ఇన్ని దినములు ప్రయాణము చేయుటకు గారణమును దెలిపియున్నాడు. ఇతడెక్కిన యోడలో రెండువందల బాటసారులు గలరు. మార్గమధ్యమునందొక గొప్పతుపానుపట్టుట సంభవించెను. ఓడకొక చిన్న రంధ్రముగూడ పడెను.ఓడలోనిసరకులను సముద్రములో బాఱవేయవలసి వచ్చెను. తానుసంపాదించిన మతగ్రంథములను విగ్రహములను పటములను వర్తకులు సముద్రములో బాఱవేయుదురేమో యని ఫాహియాన్ భయపడెను. అట్టిదేమియును తటస్థింపలేదు. కాని మూఢవిశ్వాసముగలిగిన బ్రాహ్మణులు కొందఱు తన్నుగూర్చి తమలో దామిట్లని వితర్కించుకొనిరట. ఈ శ్రామణుడు మనతోగూడ నోడపైనుండుటచేత మనమదృష్టవిహీనులమై యీవిపత్తు పాలబడితిమి;ఒక్కని కొఱకు మనమందఱము చావరాదు ; ఏద్వీపము మనకుగానంబడినను ఈ భిక్షువును భూమిమీద విడిచిపెట్టి మనము పోవుదము అయినను ఫాహియానుకు రక్షకుడుగానుండిన యాతడు వాని నొంటరిగ నేకాంతద్వీపమున జనిపోవునట్లుగ దిగవిడిచిపోవుటకై సమ్మతింపక ధృఢముగా వానిపక్షమున నిలిచియుండినట! ఈ యాత్రీకుడు జావాద్వీపములో పాషండులును బ్రాహ్మణులును వర్థిల్లించుండి రని నుడివియున్నాడు. హిందువులు వర్తకము చేయుటకై యాంధ్రరాజులకాలముననే యచ్చటికి బోవుచుండిరని యిదివఱకై వ్రాసియున్నారము. తరువాతను సహితము హిందువులు వర్తకము చేయుటకై యచ్చటికి బోవుచుండిరి. ఫాహియాన్ బ్రాహ్మణులాద్వీపమున నుండిరని వ్రాసిన విషయ మబద్ధముకాదు. నాల్గవశతాబ్దమునందు వేంగిరాజు లయిన పల్లవులు జావాసుమత్రాద్వీపములను జయించినట్లు గానంబడుచున్నది. జావాసుమత్రాదీవులలో గొన్ని శాసనములు గానవచ్చుచున్నవి.