ఇట్లు గోదావరిమండలమున మాత్రమేగాక విశాఖపట్టణమండలమందును జైనస్థానము లనేకములుగలవు. జైనమతములలో బుట్టి పెఱిగిన కృష్ణా గుంటూరు మండలములసంగతి చెప్పనక్కఱలేదు. ప్రతాపరుద్రుని కాలమువఱకు ధాన్యకటకము జైనుల స్వాధీనమందే యుండెను. బౌద్ధమతమెంత క్షీణించిపోయినను ధాన్యకటకములో (ధరణికోట) బుద్ధదేవుడు పూజింపబడుచునే యుండెను.
కుమారిలభట్టు.
ఆంధ్రబ్రాహ్మణులు మొదటినుండియు వేదవిద్యాసంపన్నులై మహావిద్వాంసులై పేరెన్నిక గాంచినవారుగా నుండిరి. ఇప్పటికి నాంధ్రబ్రాహ్మణులు వేదపఠనమునందసమాన ప్రజ్ఞగలవారని డాక్టరు భాండర్‌కర్ మొదలగు విద్వాంసు లభిప్రాయము లిచ్చి యున్నారు. వేదవేత్తలయి ప్రఖ్యాతిగాంచిన యాంధ్ర బ్రాహ్మణులలో కుమారిలభట్టు మిక్కిలి ప్రముఖుడుగానున్నాడు. ఇతడేడవ శతాబ్దములోని విద్వాంసులలో మహా విద్వాంసుడుగా నుండెను. ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను. ఈ జైమిని సూత్రములలోని మతమునకే పూర్వ మీమాంసమతమని పేరు. ఇయ్యది కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపఱచుకొని హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని నిరసించెడు జైనబౌద్ధమతముల ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక ధర్మమునుప్రబలజేసెను ఈకుమారిలభట్టునకు భట్టపాదుడను మఱియొకపేరుగలదు. ఈతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందఱు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు జెప్పబడియుండుటచేత నాంధ్రుడని విశ్వసింపవచ్చును. జినవిజయమను జైనగ్రంథమునం దీక్రిందిశ్లోకము గానంబడుచున్నది.
శ్లో. ఆంధ్రోత్కలానాం సంయోగే పవిత్రే జయమంగలే
గ్రామే తస్మిన్ మహానద్యాం భట్టాచార్యః కుమారకః
ఆంధ్రజ్యోతి స్తిత్తిరిరో మాతా చంద్రగుణాసతీ యజ్ఞేశ్వర పితాయస్య.