పుట:Andhrula Charitramu Part-1.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమిళులను బట్టియె ద్రావిడ శబ్దమేర్పడినది గావున దమిళులకు పూర్వమీదేశముననున్న వారిని ద్రావిడులని పిలువరాదని పూర్వప్రకరణలయందు చేసిన వాదము సహేతుకమైనదని తేటపడకమానదు. ఏ భాష నాగులు మొదలగు జాతులవారిచే భాషింపబడుచుండెనో యాభాషనే తమిళజాతులవారీ దక్షిణాపథమునకు రావేగమె యవలంబించిరిగావున నాటనుండియు నాభాషద్రావిడభాషగా బరిగణింపబడుచుండెను. కాబట్టి ద్రావిడ భాషలని చెప్పబడియెడి యిప్పటి యఱవము, కన్నడము, తెలుగు, మలయాళము మొదలగు భాషలకు దల్లి తొంటి నాగజాతులవారి భాషయె కాని తమిళులభాష కాదనియు, కొందఱు తలంచునట్లుగ నిప్పటి తమిళభాషనుండి తెలుగు పుట్టినది కాదనియు నూహింపదగియున్నది.

కర్ణాటము.

కర్ణమనగా కొండలోయ యనియు వానియందు సంచరించువారు కర్ణాటులనియు, కర్ణాటులు నివసించుదేశము కర్ణాటమైనదనియు కొందఱు పండితులు చెప్పునది నాలుగవప్రకరణమునుందు గొంచెముగ బ్రశంసింపబడినది. కర్ణాటమనునది మొదట కొండలోయను బట్టి కాక కర్ణులను బట్టి యేర్పడినదని కొందఱు చరిత్రకారుల యభిప్రాయమై యున్నది. ఆంధ్రదేశమును బాలించినరాజులలో "శాతకర్ణి" అనుపేరును వహించినవారనేకులుండుటచేత సామాన్యముగా నాంధ్రరాజులను కర్ణులని వ్యవహరించుచుండిరి. వీరు బహుశతాబ్దములు దేశమును బాలించినవారగుటచేత వీరికీర్తి సర్వత్ర వ్యాపించినది. తమిళజాతుల వారిచే నివసింపబడుదేశములో గొంతభాగ మాంధ్రరాజులగు కర్ణులచే జయింపబడి వారికి సంచారభూమిగనుండుట చేత నాభాగమునకు కర్ణాటమని పేరు వచ్చినదని చెప్పుచున్నారు. మొట్టమొదట కర్ణాటమని వ్యవహరింపబడిన భాగము మైసూరు దేశము. ఈ భాగము తమిళజాతులవారినుండి యాంధ్రులచే నాక్రమింపబడినదని చెప్పుటకు దృష్టాంతములుగ జారిత్రక విషయములు గలవు. హారితి పుత్త్ర శాతకర్ణి యొక్క శిలాశాసనములు రెండు మైసూరుదేశ