పుట:Andhrula Charitramu Part-1.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుని కుమారుడును నగు విధికుడను వాడు తనతల్లితోడను, తనభార్యతోడను, తనసహోదరులతోడను, తనకుమారుడగు నాగునితోడను, తనపుత్రికలతోడను, తనబంధువులతోడను, తనమిత్రులతోడను గలిసివచ్చి వ్రాయించిన దానశాసనమొకటియు, ముకుందశర్మ యనువాని కుమారుడు కూతుండ్రతోడను కోడండ్రతోడను మనమలతోడను గలిసివచ్చి వ్రాయించిన దానశాసనమొకటియు గలవు. [1] శర్మయనునది బ్రాహ్మణులపట్టపుపేరు. పై ముకుందశర్మ వైదికమతమునకు సంబంధించిన బ్రాహ్మణుడుగ గన్పట్టుచున్నాడు. విధికుడు తోళ్లపనిచేయువాడని చెప్పబడినది. వాస్తవమయినేని నాతడు హైన్యజాతివాడయి యుండవలయనుగదా. పూర్వమున సాధారణముగా మాదిగవాండ్రు మాత్రమే తోళ్లపని చేయుచుండిరి. అప్పటికి మాలమాదిగలు లేకపోయినను వాండ్రపూర్వులెవ్వరో యొకరుండి యుండక తప్పదుగదా. ఆ కాలమునందు బుద్ధుని పూజించువారిలో బ్రాహ్మణులు కూడ గలరనియు మఱియు బ్రాహ్మణుడయినను, చండాలుడయినను వర్ణ భేదము లేకుండి సమస్తమతములవారును బౌద్ధాలయములం బ్రవేశించుటకు నర్చనలు సలుపుటకు సమాన హక్కునే గలిగియున్నారనియును పై దానశాసనములు రెండును దెలుపుచున్నవి. ఆ కాలమునందు యవనపహ్లవాది మ్లేచ్ఛులే హిందూనామములను ధరించి బౌద్ధమతము నవలంబించి బౌద్ధాలయములకు వచ్చి బుద్ధుని సేవించి దానధర్మములుగావించి శాసనముల జెక్కించినవారు పెక్కండ్రుగలరు.

కృష్ణుడును వానిసోదరుడు క్షుల్లకృష్ణుడును, వారి సోదరినాభాయను నామెయు, ధాన్యకటకములోని గొప్పచైత్యమునకు నూర్థ్వపట్టమును దానముచేసిరని దెలిపెడి దానశాసనమొకటి కలదు. ఇందు కృష్ణుడు దమిళుడని పేర్కొనబడియున్నది. తమిళమె దమిళముకాగా నయ్యది ద్రమిళముగాను ద్రవిడముగాను సంస్కృత గ్రంథకారులచే బేర్కొనబడినది గావున నాశాసనమునాటికి దమిళులు వేఱుగును నాంధ్రులు వేఱుగనుండిరని తేటపడుచున్నది.

  1. The Buddhist Stupas of Amaravati and Jaggayya-peta. pp. 91 to 103.