పుట:Andhrula Charitramu Part-1.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుట్టలను దొలచి నిర్మింపబడిన బౌద్ధదేవాలయము లాకాలమునందలి యద్వితీయ శిల్పకలానైపుణ్యమును నేటికిని బ్రకాశింప జేయచుండుట ప్రశంసనీయముగదా. ఈ బౌద్ధదే‌వాలయములకు వెలుపల నంతయు గొండయైనందున బైకి శోభాయమానముగ గన్పట్టక పోయినను లోనికి బోయి చూచిన పక్షమున మహేంద్ర భవనములను బోలియుండును. ఇవిగాక అమరావతీస్తూపమువలె బయలున నిర్మింపబడిన స్తూపములు సహితము నిరుపమానమైన శిల్ప విద్యామహిమచే బ్రశంసనీయములుగ నున్నవి. వానిలో ముఖ్యముగా గుంటూరుమండలములోని అమరావతి స్తూపమునందు గానం బడియెడు శిల్పవిద్యానైపుణ్యమును గన్నులార గాంచి యానందింపవలసినదయె గాని యిట్టిదని నిరూపించి వర్ణించుటకు బదములు గానరావు; ఈ గ్రంథమును జాలదు. ఈ యమరావతీ స్తూపమును గూర్చి వివరముగా దెలిపెడి రెండు గొప్పగ్రంథము లాంగ్లేయభాషయందు విరచింపబడియున్నవి. అందొకటి డాక్టరు ఫర్యూసను(Dr. Fergus on) గారిచేతను మఱియొకటి డాక్టరు బర్గెస్సు(Dr. Burgess) గారిచేతను వ్రాయబడినవి. ఈ యమరావతీ స్తూపముచుట్టును శిలా స్తంభములతో వెలుపలను లోపలను గ్రాదులు (కంచెలు) కట్టబడనవి. ఆ స్తంభముల మీద శిల్పకులు చూపిన పనితన మంతింత యని వర్ణింప నలవికాదు. వానిలో బెద్దదియు వెలుపలదియునగు గ్రాదివలయముయొక్క నడిమికొలత 195 యడుగులును, లోపల గ్రాదివలయము యొక్క నడిమికొలత 125యడుగులునుగలిగి ఈ రెంటికి నడుమ యాత్రికుల ప్రదక్షిణ మార్గమును గూడగలిగియుండెను. పెద్ద గ్రాదివెలుపల14 అడుగులును, లోపల 12 అడుగులును, లోపల గ్రాది 6 అడుగులయొత్తును మాత్ర మండెను. పెద్దగ్రాదియొక్క క్రింది భాగము జంతువుల యొక్కయు బాలురయొక్కయు విగ్రహములతో నలంకరింపబడియెను. స్తంభములు యథాప్రకారముగ నష్టకోణాకృతులు గలిగి చక్రమువలె గుండ్రముగ నుండు బిళ్లలతో నలంకరింపబడియున్నవి. ఈ పెద్దగ్రాదియొక్క వెలుపలి భాగముకంటె లోపలిభాగమంతయు నెక్కువచిత్రముగానుండు చిత్తరువులతో జిత్రింపబడియున్నది. వెలుపలి గ్రాదికంటె లోపలి గ్రాది మీద బుద్ధుని చరిత్రము