Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనివియు గాధలలోనివియునగు స్త్రీపురుషుల యొక్క చిత్రపటములాచరిత్రమును గాథలు బోధపడురీతిగ మిక్కిలి సొగసుగాజిత్రింపబడినవి. డాక్టరు ఫర్యూసనుగారు ప్రకటించిన గ్రంధములోని చిత్రపటములలో రెండు మిక్కిలి మనోహరములుగానున్నవి. అందొకటి వెలుపలి పెద్ద గ్రాది నుండియు, మరియొకటి లోపలిగ్రాది నుండియు దీయబడినవి. తనముంగటి సైన్యము గోడలను గాపాడు చుండగా రాజు సింహాసనమున గూరుచుండి యప్పుడే యేతెంచిన యొక దూత చెప్పెడి సమాచారమును వినుచుండినట్లును, దిగువను కాల్బలము నశ్వసైన్యము దంతాఖరములు, యుద్ధమునకు బ్రయాణోన్ముఖులై నడచుచున్నట్లును శత్రుకోటిలో నొకడొవచ్చి సంధిని కోరుచున్నట్లును మొదటిదానిలో నత్యద్భుతంగా జిత్రించబడినది. అయ్యది నిన్న మొన్నను జిత్రింపబడినట్లుగా నుండి యాకాలపు శిల్పకారుల నైపుణ్యమును బుద్ధి వైభవమును నాగరికతను వేనోళ్ళ జాటుచున్నది. డాక్టర్ ఫర్యూసనుగారును, డాక్టరు బర్గెస్సుగారును ఆపటమును నెక్కువగ మెచ్చుకొని యున్నారు.

రెండవపటము మూడు పూజార్హములయిన వస్తువులను దెలుపుచున్నది. అందొకటి గ్రాదులతోటి స్తూపము, మరియొకటి, మతచక్రము, వేరొకటి పవిత్రమైన వృక్షముగాని (బోధివృక్షం) బుద్ధుని దంతమునుగాని పూజించుచున్న సంఘము. ఈ స్తూపముపైని బుద్ధునికి సంబంధించిన విగ్రహములు మాత్రమె గాక నాగరికతయందు వెనుక బడియున్న ప్రాచీన నాగులయొక్క యు నాగరాజులయొక్కయు, నాగకన్యల యొక్కయు, విగ్రహములు కూడ పెక్కులు చిత్రించబడియున్నవి. ఇట్టి స్తూపము అమరావతివి గాక జగ్గయ్య పేట, గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాల మొదలగు స్థలములలో గూడ మరికొన్ని గలవు. గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాలలోని ఇటుకలతోను సున్నముతోడను గట్టబడినవిగా నున్నవి. మరియును బౌద్ధభిక్షువుల కొరకు బర్వతములలో దొలుపంబడిన విహారములలోను చైత్యములలోను కార్లీ పర్వతములోని చైత్యమును ఆజంటావిహారమును గొప్పవి. కార్లీ