పుట:Andhrula Charitramu Part-1.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇవిమాత్రమే గాక సంపూర్ణములయిన ప్రత్యేక విగ్రహములును, తునకలయిపోయిన విగ్రహములును పెక్కులు బయలుపడినవి. సొగసుగా జిత్రింపబడిన యొక నల్లని చిన్నఱాతి విగ్రహమును, శాసనములును, చలువఱాతిపలకలును నిడుపాటి ఱాతితొట్లును, ఱాతికంబములును మనుష్యవిగ్రహములును, స్తంభములయొక్క పీఠములును, నాణెములును, పూసలును మఱియునొక యిత్తడిగొలుసు, మేకులు, చీరణములు (కాసెయులులు) కత్తులు, ఒక గంటము, ఒక తాపియు(గోడమొదలగువానికి సున్నము వేయు పనిముట్టు) చక్కగ పోతపోయబడిన యొక మట్టికూజాయు, పెక్కుమంటి సెమ్మెలు, మంటితాంబాళము, మంటిగొట్టములు, మంటిచట్టములు, మంటిమూకుళ్లు మొదలగు వస్తువులును, మనుష్యుల దంతములు, మనుష్యుల బొమికలును గానుపించినవి. ఈ ద్వారముల కడగానిపించిన గోడలు వెలుపలి మంటిదిబ్బలవఱకును వ్యాపించి యుండుటచేత దాగోబాలుండిన యెడల బయలుపడు వఱకు త్రవ్వించవలసిన పనినిలిచియున్నది."

ధాన్యకటకనగరము.

భరతఖండమునందలి పురాతన పట్టణములలో పాటలీపుత్త్రమునకు దరువాత ధాన్యకటకనగరమే విశేషప్రఖ్యాతి గాంచినదిగా నున్నది. ఇది క్రీస్తుశకమునకు బూర్వము నాగరాజులకును క్రీస్తుశకమునకు దరువాత శాలివాహనులకును రాజధానినగరముగానుండి యాంధ్ర సామ్రాజ్యమునకంతకు బహుశతాబ్దములకాలము మేటికిరీటమా ప్రకాశించియుండెను. ఈ మహానగరము పదునెనిమిది శతాబ్దములక్రిందట బొందిన మహోన్నతవైభవమంతయు నాగరికతాప్రశస్తి గాంచిన పాశ్చాత్యపండితమండలి నేడు ధరణికోటమంటిదిబ్బలలో గాంటి యచ్చెరువందుచు వేనోళ్ల బొగడుచుండుటనకు జూచుచుండునపుడాంధ్రదేశమున జన్మించిన యేదేశభక్తుని హృదయమున కానందజనకముగా నుండ కుండును? ఈ పురాతనాంధ్రనగరములో బ్రాచీనాంధ్రులచారిత్రము గూడ బయలుపడి యాంధ్ర జాతీయాభివృద్ధికి దోడ్పడుచున్నది.

ఈధాన్యకటకమునే కొందఱు ధన్యకటకమనియు, ధనకటకమనియు గూడ వాడుచువచ్చిరి. మొదటిపేరు ధాన్యకటకమే గాని మఱియొకటికాదు.