పుట:Andhrula Charitramu Part-1.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది కృష్ణానదీ ముఖద్వారమునకు నెగువున నఱువది డెబ్బది మైళ్ల దూరమున మునియేఱు సంగమించు స్థానమున కెదురుగ గృష్ణానదికి గుడిప్రక్కను దక్షిణపుటొడ్డున గట్టబడి యున్నది. ప్రాతపట్టణమగు ధరణికోటకు దూర్పుగా నరమైలు దూరమున కూచితిప్పయను మఱియొక మంటిదిబ్బ గలదు. అది యింకను బరిశోధింపబడవలసి యున్నది. దక్షిణమున నక్క దేవరదిన్నె యను మఱియొక మంటిదిబ్బ కలదు గాని యది త్రవ్వబడి యందు బూడ్చుకొని పోయి యుండినవస్తువులు నూతననగరనిర్మాణమునందు నుపయోగింపబడినవి. ఈయమరావతీ స్తూపమును ఇచ్చటి పురాతనశిలలు మొదలగువానిని భూమిలో నుండి పెళ్లగించి కాపాడుటకై దొరతనము వారి ప్రయత్నములు నేటివఱకును జరుగుచునే యున్నవి, పురాతనపు గట్టడములు పురాతనపు బనిముట్లు పురాతనపు శిలలు మొదలగున వెన్నియో బయలుపడినవి. ఇంకను గొన్ని బయలుపడుచున్నవి. ఇంకను మఱికొన్ని బయలుపడవచ్చును. ఈ‌విషయమున ప్రాచీన వస్తు పరిశోధనాధికారిగ నుండిన (ఆర్క్యలాజికల్ సర్వే డిపార్టుమెంటునకు స్యూపరింటెండుంటు) రీ దొరగారు 1902వ సాంవత్సరిక వృత్తాంతమునందు వ్రాసిన వాక్యములను దెలుపుట యుక్తము. [1] "1902-07(?)సంవత్సరములన జేసినపని గతసంవత్సరము జేయగా మిగిలిన పనిని ప్రారంభించుటయే యై యుండును. అందు ముఖ్యముగా నుత్తరద్వారమువద్దను పశ్చిమద్వారము వద్దను ప్రారంభింప బడియెను. అసలు మంటిదిబ్బపైన మన్ను పరిమాణము లెక్కింప నలవి కాని యంతయత్యధికముగా నిలిచి యుండుటచేత ఈ ద్వారములకడ దాగోబా (చైత్యము) లను కనుగొనునంతటి దూరమువఱకు త్రవ్వికను కొనిపోయి యుండలేదు. అయినను ఫలితములు రంజింప జేయునవిగా నున్నవి. ఇటుకగోడలును చలువఱాళ్ల గ్రాదికంబములయొక్క భాగములును బయలుపడినవి.

  1. The Annual Progress Report of the Archeological Survey Department, Southern Circle for the Year 1906-07, p.2.