పుట:Andhrula Charitramu Part-1.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్చి యేమియు వ్రాయబడియుండలేదు. మఱియును అశోకుని కాలమునకు (క్రీ.పూ.240) బూర్వము 100 సంవత్సరముల క్రిందటనే బుద్ధ నిర్వాణము చెప్పబడియున్నది. కనుక శకరాజయిన కనిష్కుని బౌద్ధసభ బుద్ధ నిర్వాణమునకు దరువాత 400 సంవత్సరములకు జరిగినదని పేర్కొనుచున్నది. ఈ కాలనిర్ణయమునే హౌనుత్సాంగు తన గ్రంథమనందనుసరించియున్నవాడు. బుద్ధనిర్వాణమునకు నాలుగు వందల సంవత్సరముల వెనుక జెప్పబడిన కనిష్కుడను రాజు క్రీస్తు శకము 78-100 సంవత్సరముల ప్రాంతముననున్నవాడని సామాన్యముగా నందఱిచేత నంగీకరింపబడియెను. బౌద్ధుల ప్రధాన గురువగు పార్శ్వకుడు బౌద్ధ సభకధ్యక్షుడుగా నున్నందున కనిష్కునకు సమకాలీనుడైయుండెను. పార్శ్వకుని తరువాత నాచార్యపీఠము నెక్కినవా డశ్వఘోషుడు. నాగార్జునుడు నాల్గవ వాడు. దీనింబట్టి నాగార్జునుడు రెండవ శతాబ్దాంతమునున్నట్లు చెప్పవచ్చును. బుద్ధనిర్వాణమునకు 500 సంవత్సరముల వెనుక నాగార్జునుడున్నట్లు కొన్ని చరిత్రములు చాటుచున్నవి. టిబెట్ దేశ చరిత్రమును వ్రాసిన తారానాథుడు క్రీ.శ.180-220లకు నడుమ నాగార్జునుడున్నవాడని కాలనిర్ణయము చేయుచున్నాడు. కాబట్టి గోతమిపుత్ర్త యజ్ఞశ్రీ కాలమున నాగార్జునాచార్యుడున్నవాడని చెప్పవచ్చును. వీని పేరుగల నాణెములయందు "ఓడ " చిత్రింపబడియుండుటచేత నీతని కాలమున నోడలను గూర్చియు సముద్రమును గూర్చియు నావికాయాత్రను గూర్చియు జ్ఞానమును ప్రజలు గలిగియున్నారనియు, సుమత్రా, జావా, బోర్నియో మొదలగు ద్వీపాంతరములతోడను, చీనా, బర్మాదేశములతోడను, సింహళ ద్వీపమ తోడను, విశేష వర్తక వ్యాపారము జరుగుచున్నట్లుగ నూహింపబడుచున్నది. ఆంధ్రరాజులలో విశేషకాలము రాజ్యపాలనము చేసినవారిలో నీతడొకడుగా గన్పట్టుచున్నాడు. వీని వెనుక నాంధ్రరాజ్యము బహుకాలము నిలిచియుండలేదు. రాజవంశము పలుశాఖలుగ జీలిపోవుటవలనను, రాజ్యభారమును వహించినవారు బలహీనులగుట వలనను వీని తరువాత నాంధ్రరాజ్యమంతః కలహములచే నంతరించి పోయినది.