పుట:Andhrula Charitramu Part-1.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాసిష్ఠీపుత్ర శాతకర్ణియు నొక్కడేయనియు, వాని భార్య మహాక్షాత్రపుడు రుద్రునియొక్క కూతురనియు, ఆ మెయె యజ్ఞశ్రీశాతకర్ణి యొక్క తల్లియగు గోతమియనియు, కాబట్టి రుద్రదామునకు దక్షిణాపథపతితో గల సంబంధము పై జెప్పిన ప్రకారము తన యల్లుడైన చతురపానుని బట్టిగాని మనమడయిన యజ్ఞశ్రీ బట్టిగాని, యజ్ఞశ్రీ తల్లి రుద్రదామునికి సమీపబంధుత్వము కలిగియుండుటబట్టిగాని యేర్పడియుండవచ్చునని సారాంశమును దేల్చిరి. పైజెప్పిన శాసనమునుబట్టి మహాక్షాత్రపుడయిన రుద్రదామునియొక్క యల్లుడు వాసిష్టీపుత్ర శాతకర్ణియని స్పష్టమగుచుండగా వాసిష్ఠీపుత్ర పులమాయి రుద్రదాముని యల్లుడని స్మిత్తుగారు చెప్పుటకు గారణముగానరాదు. దక్షమిత్ర నహపానుని కొమార్తెయనియు, ఋషభదత్తుని భార్యయనియు నాసిక శాసనములలో గన్పట్టుచుండగా స్మిత్తుగారు దక్షమిత్ర రుద్రదాముని కూతురనియు, శ్రీ పులమాయి పట్టమహిషియని చెప్పుటకు గారణముగానరాదు. రుద్రదాముడు జయించిన దక్షిణా పథపతి శాతకర్ణిగాని మఱియొకడుగాడు. శ్రీ పులమాయికి శాతకర్ణియను పేరులేదు. రుద్రదాముని యల్లుడు గూడ శాతకర్ణియను పేరు గలిగియుండెను. అదియునుగాక శ్రీపులమాయికి రుద్రదాముని తాతయగు చస్తనుడు సమకాలీనుడని టాలెమి వ్రాయుచున్నాడుగాని రుద్రదాముడు సమకాలీనుడని వ్రాసియుండలేదు. రుద్రదాముని జనగడ శాసనములో శకనృపకాలము 72వ సంవత్సరముననని చెప్పినను ఆ సంవత్సరము చెఱువుగట్టు తెగిపోయెనని చెప్పెనేకాని తానాసంవత్సరము గుహతొలిపించి శాసనము వ్రాయించినట్లు చెప్పియుండలేదు. కాబట్టి రుద్రదాముడు శ్రీ పులమాయితోగాక వాసిష్ఠీపుత్ర చతుష్పర్ణ శాతకర్ణికిని, గోతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణికిని మాత్రము సమకాలీనుడుగానున్నవాడు. ఒకవేళ శ్రీపులమాయి వృద్ధదశలో నుండినను నుండవచ్చును. కనుక శ్రీపులమాయి రుద్రదాముని యల్లుడనియు, రుద్రదాముడు శ్రీ పులమాయిని రెండుసారులోడించెననియు, దక్షమిత్ర రుద్రదాముని కూతురనియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాసినది విశ్వసింపదగినదిగా గన్పట్టదు. ఇందుకు శాసనములే ప్రబలసాక్ష్యములిచ్చుచున్నవి. శ్రీ పులమాయి కాలమున కో