లక్ష్మణరావు పంతులు. ఎమ్.ఏ గారికిని, మరియు నీ కార్యమునందు బ్రోత్సాహమును గలిగించుటయెగాక నేను నా కుటుంబముతో జెన్నపట్టణమున నున్న కాలమున నవసరమువచ్చినప్పుడెల్లను మాగృహమునకు వచ్చి మందులు మ్రాకులు ఇచ్చి యాదరముతో జూచిన విజ్ఞానచంద్రికామండలి మేనేజరు మ.రా.రా.శ్రీ ఆచంట లక్ష్మీపతి.బి.ఏ.ఎమ్.బి.సి.ఎమ్ గారికిని, మరియును విజ్ఞానచంద్రికామండలికి గార్యదర్శిగానుండి సుహృద్భావముతో నాయుద్యమము నామోదించి ప్రోత్సాహము కలుగజేసిన బ్రహ్మశ్రీ రావిచెట్టు రంగరావుపంతులుగారికిని, నాకృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాను. దేశభాషాభిమానులయిన యిట్టిమిత్రవర్గముయొక్క తోడ్పాటుతో నొక సంవత్సరకాలమహోరాత్రములు కృషిచేసి యేదో యొక్క విధముగా నాంధ్రదేశచరిత్రముయొక్క యీ ప్రథమభాగమును రచించి ప్రకటింప గలిగితిని.
గ్రంథనామము
ఆంధ్రదేశ కథాసంగ్రహమని మొట్టమొదట నామకరణము జేసితిని, గాని యందువలన నాంధ్రదేశమునకు వెలుపల నుండిన యాంధ్రలుయొక్క చరిత్రము విడిచిపెట్టవలసివచ్చినందున నదియుక్తముగాదోపక గ్రంథములోపలి పత్రములలో ఆంధ్రదేశ కథాసంగ్రహమని ముద్రింపబడినను ఆంధ్రులచరిత్రమనుటయె సముచితముగా నుండునని తరువాత దలంచుటచేత నట్లనే గ్రంథము మొదట బేర్కొనబడియెను గావున జదువరు లీ ద్వినామకరణమునకు నాక్షేపింపకుందు రనినమ్ముచున్నాడను.