Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్ర విభాగములు.

ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము, చాళుక్యచోడవంశము, కళింగగాంగవంశము, ఆంధ్రచోడవంశము, బాణవంశము, వైదుంబవంశము, హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము, కళింగగాంగవంశము, విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి.

మధ్యయుగమునందు కాకతీయగణపతివంశము, ఆంధ్రకలికాలచోడవంశము (మనుమసిద్ధిరాజువంశము), కోటవంశము, రెడ్లవంశములు, యాదవవంశము, సాళువవంశము, మొదలగురాజవంశములచరిత్రములు చేర్పబడును. ఇందలి కాకతీయగణపతులచరిత్రను, మనుమసిద్ధి రాజవంశమును పూర్వయుగమునందు బ్రారంభింపబడవలసినవైనను మధ్యయుగమునందుగూడ వారి వంశములుండుటచేతను, వారలచరిత్రమువిపులముగ వ్రాయవలసియుండుటచేతను వానిని మధ్యయుగమునందు జేర్చితిని.