పుట:Andhrula Charitramu Part-1.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాజప్రతినిధిగను ప్రతిష్టానపట్టణము నుండి పరిపాలనము సేయుచు క్షాత్రవులతో దండ్రికి జరిగిన యుద్ధములో తండ్రితో గూడ నుండి యుద్ధములను జేసి జయధ్వజములెత్తుచు వచ్చినవాడు. తండ్రివలెనే యితడును మిక్కిలి పరాక్రమవంతుడుగానున్నాడు. ఇతనికి శాతకర్ణియను పేరులేదు. జనకుని మరణానంతరమున నితడు ధాన్యకటకమున బట్టాభిషేకము పొందినటుల గన్పట్టుచున్నది. ఇతని పేరుగల శాసనమొకటి ధాన్యకటక స్తూపమున గానంబడుచున్నది. వాసిష్ఠీపుత్రుడయిన శ్రీ పులమాయి రాజ్యము చేయుచుండగా చైత్యకీయ శాఖవారి స్వాధీనమునందుండిన బుద్ధునియొక్క మహాచైత్యమునకు గృహస్తుడయిన కహుతారయు, ఋషిలుడును, వాని భార్య నాగనికయు, వాని కొడుకులును, గలిపి ధర్మచక్రమును దానము చేసిరని చెప్పబడినది. [1] శాతవాహనులలో పులమాయియను పేరుగలవారిలో నీతడు రెండవవాడు గావున రెండవ పులమాయి యని పిలువబడుచున్నాడు.

క్షాత్రవస్వామి జయదాముని దండయాత్ర.

సౌరాష్ట్ర క్షాత్రవుల వంశము నిర్మూలము చేసి శాలివాహనులు విజృంభించి యాంధ్ర సామ్రాజ్యము నానాముఖముల విస్తరింపజేయుటకు సహింపంజాలక శాలివాహనుల విజృంభణము మాన్పినగాని తమ రాజ్యమునకు క్షేమములేదని నిశ్చయించుకొని ఉజ్జయినీపురవరాధీశ్వరుండును, మహాక్షాత్రవుడను అగు చస్తనుని కుమారుడు క్షాత్రపస్వామి జయదాముడను వాడు బహుసేనలంగూర్చుకొని ప్రతిష్ఠానముపై దండెత్తివచ్చి యా పట్టణమును ముట్టడించెను. అప్పుడు శాలివాహనులకును క్షాత్రవులకును ఘోరసంగ్రామము జరిగెను. ఆ మహాఘోర సంగ్రామమునందు నుజ్జయినీపురాధీశ్వరుండు మృతినొందినట్లు గానంబడుచున్నది. ఇట్లు శాలివాహనులు క్షాత్రవుల రణరంగమున నోడించుటయేగాక క్షాత్రప సైన్యమును మాళవదేశములోనికి దఱుముకొనిపోయి మాళవదేశములోని విశేష భాగమాక్రమించుకొనిరి. ఇట్లు కొంతకాలము చస్తనుని రాజ్యమాంధ్రుల వశమైయుండినటుల గాన్పించుచున్నది.

  1. Dr. Burgess; Buddhistic stupas of Amarawati. p.100 plate VLI No.1 (Amarawati inscriptions.)