పుట:Andhrula Charitramu Part-1.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ గుహయొక్క వసారాకు నెడమ ప్రక్కనున్న గోడమీదను మఱియొక శాసనముగలదు. అయ్యది ధాన్యకటకాధీశ్వరుడయిన గోతమిపుత్ర్త శాతకర్ణి జయముగాంచిన తన సేనయొక్క నివేశనస్థానమునుండి గోవర్థనములోని తన సైన్యాధికారియైన విష్ణుపాలితుడనువానికి దెలియజేసిన యుత్తరువు యొక్క భావమును దెల్పునదిగనున్నది. అప్పటివఱకు ఋషభదత్తుని స్వాధీనములోనుండిన రెండునూఱుల నివర్తనముల పరిమాణముగల పొలమును సాధులయుపయోగార్థము దానముచేసెను. ఇచ్చట లిఖింపబడిన శాసనము 18వ సంవత్సరమున అనగా గుహ పూర్ణముగా నిర్మింపబడి సమర్పింపబడిన పూర్వసంవత్సరమున మొట్టమొదట ప్రకటింపబడినదిగా జెప్పబడినది. దీని దిగువను గోతమిపుత్ర శాతకర్ణియొక్క పట్టమహిషిచేత గోవర్థనమునకు పాలకుడుగా నేర్పఱుపబడిన శ్రావకుడను వానికి జేసిన యాజ్ఞరూపముగానుండెడు మఱియొక శాసనముగలదు. ఈమెకూడ రాజమాతయని పిలువబడుచున్నది. ఇదివఱకు దానముచేసిన పొలమునుగూర్చి ప్రశంసింపుచు నది నూఱునివర్తనముల పరిమాణముగలదనియు చెప్పి రాజ్యములోనిదియు, తన పిత్రార్జితమునగు మఱి నూఱునివర్తనముల భూమిని నీ శాసనము మూలముగ నామె దానము చేసెను. మొదటి శాసనము ప్రకారము రెండు వందల నివర్తనముల పొలమును దానము చేసినను అది నూఱు నివర్తనములు మాత్రమే యున్నందున కొదువ నూఱు నివర్తనముల భూమి మఱియొక పొలమునుండి యామె యిచ్చినట్లు గానుపించుచున్నది. ఈ దానముచేసిన సంవత్సరము 24 అగుటచేత మొదటిదాని తరువాత 6 సంవత్సరములకీదానము చేయబడినది. [1]

ఈ పైజెప్పిన శాసనములలో మహారాజుయొక్క తల్లియనియు, మహారాజుయొక్క పితామహియనియు గోతమి పేర్కొనబడుటచేతను, గోతమిపుత్ర్త శాతకర్ణి యొక్క రాణి మహారాజుయొక్క తల్లియని పేర్కొనబడుటచేతను శాతకర్ణి గాక యా శాసనములలో బేర్కొనబడిన మఱియొక రాజు పులమాయిగా గన్పట్టుచుండుటచేత నతడు గోతమికి మనుమడుగను, శాతకర్ణి

  1. No. 25. Nasik Inscriptions, Arch surv, W.Ind No. 10.