పుట:Andhrula Charitramu Part-1.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సావహించి పాదపూజ లర్పించుచుండిరి; అతని సామగ్రిని మోచుజంతువులు మూడు సముద్రములనుండి జలమును త్రాగుచుండినవి; శరణుచొచ్చినవారిని సంరక్షించెను; తన ప్రజల సుఖదుఃఖములను దనవిగా భావించుకొనియెను; మానవప్రకృతికి ననుగుణములగు ధర్మార్ధకామములనెట్టి కాలముననెట్టి ప్రదేశముల నేరీతి ననుభవింపవలయునో వానింగూర్చి చక్కగ నాలోచించెను. అతడు విద్యానిధి; సజ్జనులకాశ్రయుడు; కీర్తికిరవైనవాడు; సదాచారసంపన్నుడు, సద్వర్తనకుబెట్టినపేరు; అతడొక్కడే ప్రజ్ఞావంతుడు; అతడొక్కడే బ్రాహ్మణసంరక్షుకుడు. అతడు బ్రాహ్మణజాతి వర్ధిల్లుటకు మార్గముకలుగజేసెను; వర్ణసంకరాభివృద్ధిని నడ్డగించెను; అతని శూరకృత్యములు రామకేశవార్జునభీమసేనాదుల శూరకృత్యములను మించియుండెను; అతని పరాక్రమము నాభాగ నహుష జనమేజయ నగర యయాతి రామాం బరీషాదులను మించియుండెను; అసంఖ్యేయములయిన యుద్ధములలో శాత్రవసమూహంబులను నిర్మూలముచేసెను; క్షత్రియుల గర్వభంగమునుగావించెను; యవనశకపహ్లవుల నాశముగావించెను; ఖగారాట వంశమును కూకటివ్రేళ్ళతో బెఱికివేసి యూరుపేరులేకుండ ధ్వంసముచేసెను. శాతవాహన వంశముయొక్క కీర్తిని పునస్థాపితముగావించెను; ఇంతియగాక యీ గుహలోని బౌద్ధాలయముయొక్క సంరక్షణకై యొక గ్రామమునుగూడ దానముచేసెను. [1]

ఈ శాసనముక్రిం ద గోతమపుత్రశాతకర్ణి ధాన్యకటకాధీశ్వరుండని తెలిపెడి చిన్నశాసనమొకటి కలదు. నవనరాధీశ్వరుండయిన వాసిష్ఠపుత్ర శ్రీపులమావి గోవర్ధనమునందుండెడి తన సైన్యాధికారియగు సర్వాక్షదళనునకు ధాన్యకటకాధీశ్వరునిచే (గోతమిపుత్రుడు) దానము చేయబడిన గ్రామమును (పై శాసనములో జెప్పినది) భద్రాయనీయులచేత నంగీకరింపబడనందున మఱియొక గ్రామము దానము చేయబడినదిగా దెలిసికోవలసినదని చెప్పెడి శాసనముగానున్నది.[2]

  1. No.26. Nasik Inscriptions Arch Surv W.Ind.No.10.
  2. No.27. Ibid.,