పుట:Andhrula Charitramu Part-1.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్కొనబడుటచేతను, శాసనములలో దాము శాతవాహన వంశజులమని పేర్కొనుటచేతను, వారి ముఖ్య రాజధాని యాంధ్రదేశములోని ధాన్యకటకనగరమగుటచేతను, పురాణములలోని యాంధ్రభృత్యవంశమును శాసనములలోని శాతవాహన వంశమును నొక్కటియేయని నిస్సంశయముగా జెప్పవచ్చును. ఆంధ్రభృత్యవంశమనియెడు నీ శాతవాహన వంశమునకు శాతవాహనుడు వంశకర్తయని చెప్పకయ చెప్పుచున్నది.

శాతవాహనుడే శాలివాహనుడు.

శాతవాహనునే ప్రాకృతభాషలో శాలివాహనుడందురు. ఈ శాతవాహనుని చరిత్రము పురాణములలోగాని శాసనాదులలోగాని యెచ్చటను గానరాదు. ఈతనిం గూర్చిన విశ్వాసపాత్రమయిన చరిత్రమింతవఱకును గాన్పింపలేదుగాని యీతని పేరిట నద్భుతములయిన గాథలు మాత్రము వేనవేలు దేశమునకొక విధముగా బహుదేశములయందు భరతఖండమునంతట వ్యాపించియున్నవి. ఆ గాథలు శాతవాహనుని కాలమును నిర్ణయించుటకెంత మాత్రమును బనికిరావు. కేవలము కల్పితములయిన గాథలనేకములు వీరాగ్రగణ్యుడైన శాతవాహనుని మెడకు ముడివెట్టబడినవి. ఈతనియొక్క ప్రఖ్యాతినిబట్టి యిటీవలి రాజులెందఱో యీ శాతవాహనునితో దమకేమియు సంబంధము లేకపోయినను తామీతని సంతతివారమని గొప్పగా జెప్పుకొనుచుండిరి. ఇతడాంధ్రజాతీయుడని యాంధ్రదేశమును బాలించిన యాంధ్రభృత్యవంశమనియెడు శాతవాహన వంశమునకు మూలపురుషుడని ఆంధ్రమహారాష్ట్రదేశములలోని శాసనాదుల వలనను పురాణాదుల వలనను స్పష్టముగా దెలియుచుండగా దదితర దేశరాజన్యులకెట్లు వంశకర్తయయ్యెనో దెలియరాకున్నయది. ఇతడు కుమ్మరవాడని చెప్పెడి కథలును, మాళవ దేశాధిపతియైన విక్రమార్కుని నీతడు పంపెనని చెప్పెడి కథలును గల్పితములుగాని సత్యములు గావనియును, అవి యెట్లు గల్పింపబడినవియును ఈ చరిత్రమును సాంతముగ జదివి యవగాహము జేసికొనువారికి బోధపడకమానవు. ఇతని చరిత్రము మనకు స్పష్టముగ దెలియకపోయినను మగధరాజ్యమును పుష్యమిత్రుడాక్రమించుటకు బూర్వముననే యీ వీరవరాగ్రగణ్యుడాంధ్ర రాజ్యా