పుట:Andhrula Charitramu Part-1.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధిపత్యము వహించి పశ్చిమోత్తర భాగమున బహుదేశములనుజయించి యాంధ్రరాజ్యమును నానాముఖముల విస్తరింపజేసి రాజధానిని శ్రీకాకులమునుండి విజయవాటికకు (Bezawada) బడమట 17మైళ్ళ దూరమున గృష్ణానదికి దక్షిణమునుండు ధాన్యకటకమునకు మార్చుటయేగాక మహారాష్ట్రదేశము నందలి గోదావరి తీరముననుండెడి ప్రతిష్ఠానపురమును యువరాజులకునికిపట్టుగ జేసినట్లు గన్పట్టుచున్నది. అట్టి యీ యాంధ్రవీరునిగూర్చి బహుదేశములలో వ్యాపించిన కల్పితకథలకెల్లను మూలకారణము కథాసరిత్సాగరము నందలి మహాగాథయె గాని వేఱొండుగాదని తోచుచున్నది. కశ్మీర దేశపు రాజయిన యనంతుని పట్టమహిషియగు సూర్యవతీదేవి చిత్తవినోదార్థము నానాకథామృతమయమైన యీ బృహత్కథాసార సంగ్రహమును బ్రాహ్మణోత్తముడయిన రామదేవుని కుమారుడు సోమదేవుడనువాడు కథాసరిత్సాగరమను నీ యుద్గ్రంథమును సంస్కృతభాషలో విరచించెను. [1] ఈ కథాసరిత్సాగరమును రచించిన సోమదేవుడును సంస్కృతభాషలో బృహత్కథను రచించిన క్షేమేంద్రుడును పైశాచీభాషలో వ్రాయబడిన మొదటి బృహత్కథనుండి తమ కథల సంగ్రహించితిమని చెప్పుకొనియున్నారు.

బృహత్కథ.

ఈ బృహత్కథను మొట్టమొదట శివుడు పార్వతికింజెప్పెను. అట్లు చెప్పుచుండగా శివుని ప్రమథగణములలోని వాడగు పుష్పదంతుడు వినెను. ఈ సంగతి పార్వతి తెలిసికొని భూమిమీద మనుష్యుడవై పుట్టుమని పుష్పదంతుని శపించెను. పుష్పదంతుడే వరరుచియను బ్రాహ్మణుడై పుట్టి మగధ దేశమును బాలించెడు యోగనందునకు మంత్రియయ్యెను. ఈ వరరుచియె కాత్యాయనుడను పేరిట బరగుచుండెను. ఇతడు వింధ్యారణ్యమునందలి కా

  1. దీనినే చెన్నపురి క్రిస్టియన్ కాలేజిలో సంస్కృత ప్రధానోపాధ్యాయులుగానుండిన బ్రహ్మశ్రీవేదము వేంకటరాయశాస్త్రి గారాంధ్రములోనికి జక్కని శైలిని భాషాంతరీకరించినారు.