Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజెప్పియుండ భాగవత పురాణము శాతకర్ణియను పేరు మార్చి శాంతకర్ణుడని పేర్కొనుచున్నది. మత్స్యపురాణము కృష్ణునికి శాతకర్ణికి నడుమ మఱిముగ్గురు రాజులు నెక్కువగా బేర్కొనుచున్నది.
ఇంతియగాక విష్ణుపురాణము మత్స్యపురాణములోని శాతకర్ణికనుగుణముగానుండు మఱియొక శాతకర్ణిని పేర్కొనుచున్నది. వాయుపురాణము ప్రకారము గోతమిపుత్రుడు పదమూడవ రాజకుమారుడుగను, భాగవతా పురాణము ప్రకారము పదునేనవ వాడుగను, విష్ణుపురాణము ప్రకారము పదునేడవ వాడుగను, మత్స్యపురాణము ప్రకార మిరువది రెండవ వాడుగ నుండెను. విష్ణుభాగవతమత్స్య పురాణముల ప్రకారము పులోమదుడు గోతమిపుత్రుని తరువాతి వాడుగ నుండెను. వాయుపురాణము వీని పేరు పూర్తిగ విడిచిపెట్టుచున్నది. విష్ణుమత్స్యపురాణముల ప్రకారము వాని వెనుక వచ్చినవాడు శివశ్రీయను వాడైయున్నను భాగవతపురాణము వేదశ్రీయను వాడని పేర్కొనుచున్నది. వాయుపురాణము వీని పేరెత్తక మౌనము వహించినది. శివశ్రీ తరువాత వచ్చినవాడు శివస్కందుడని యొక్క వాయుపురాణము తక్క తక్కినవన్నియు నంగీకరించినవి. వీని తరువాత వచ్చిన యజ్ఞశ్రీయనువానిని పురాణములన్నియు నొప్పుకొనుచున్నవి గాని వాయుపురాణము వానిని గోతమిపుత్రునికి వెనుకబేర్కొనుచున్నది.

ఆంధ్రభృత్య వంశమే శాతవాహన వంశము.

పురాణములలో బేర్కొనబడిన యాంధ్రభృత్యరాజులలోని కొందఱి శాసనములు దక్షిణాపథమున గానవచ్చుచున్నవి. శాసనములు మాత్రమెగాక వేనవేలు నాణెములు కూడ గానంబడినవి. అయ్యవి నాసిక, జనగడ, కార్లి, ఠాణా మొదలగు మహారాష్ట్ర స్థలములయందును, ధరణికోట, జగ్గయ్యపేట, గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాల, చినగంజాము మొదలగు నాంధ్రదేశములోని స్థలములయందును విశేషముగా గానవచ్చినవి. పురాణములలో బైన బేర్కొనబడిన కృష్ణుడు, శాతకర్ణి, పులమాయి, గోతమిపుత్రుడు , శివశ్రీ, యజ్ఞశ్రీ మొదలగు నాంధ్ర రాజులీ శాసనమునలోను నాణెములలోను బే