శ్రీముఖుడను నాంధ్రరాజు మగధదేశమును బాలించెడి కాణ్వవంశజుడగు సుశర్మను జంపి మగధ రాజ్యము నాక్రమించుకొను నాటివఱకు నాంధ్రులను, నాంధ్రరాజులను గూర్చి చరిత్రాంశము లేవియు వినరావు.
పురాణములలోని రాజవంశములు.
మగధ రాజ్యమును శిశునాగవంశమునకు దరువాత మౌర్యులు పదిమంది నూట ముప్పది యేడు సంవత్సరములు పరిపాలింతురనియు, వారి తరువాత శుంగవంశజులు పదుండ్రు నూట పండ్రెండు సంవత్సరములు పరిపాలింతురనియు, తరువాత కాణ్వవంశీయులు రాజులై నలుబడియైదు సంవత్సరములు మాత్రమె పాలింతురనియు, వారి వెనుక నాంధ్రరాజులు రాజ్యమాక్రమించుకొని నాలుగు వందల యేబది యారు సంవత్సరముల వఱకు బరిపాలన సేయుదురనియును పై జెప్పిన పురాణములలో వ్రాయబడియుండెను. కాబట్టి చంద్రగుప్తుడు 321వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినవాడు కావున మౌర్యులాకాలము మొదలుకొని 137 సంవత్సరముల కాలమనగా 184వ సంవత్సరము వఱకును బరిపాలన చేసియుందురు తరువాత రాజ్యమునకు శుంగవంశజులు 184వ సంవత్సరము మొదలుకొని 112 సంవత్సరములనగా 72వ సంవత్సరము వరకును బరిపాలనము జేసియుందురు. వారి వెనుక వచ్చిన కాణ్వులు నలువురును నలువది యైదు సంవత్సరములనగా 27వ సంవత్సరము వఱకును బరిపాలించియుందురు. అటుపిమ్మట నాంధ్రభృత్యవంశ మారంభమైయుండును. ఆంధ్రభృత్యులనగా నొకప్పుడు భృత్యులుగానుండి యాంధ్రులనియర్థము. ఈ పురాణములో నీ రాజవంశములు పేర్కొనబడుటయే గాక యా వంశములలోని రాజుల నామములును వారలు పరిపాలనము చేసిన సంవత్సరములునుగూడ పేర్కొనబడియున్నవి. కాణ్వాయనీయులను పదభ్రష్టులను జేసిన యాంధ్రుడు సింధుకుడని వాయు పురాణమును, శ్రీప్రకుడని విష్ణుపురాణమును, శ్రీశుకుడని మత్స్యపురాణమును పేరు చెప్పక వృషలుండని మాత్రము భాగవతపురాణమును బేర్కొనుచున్నవి. ఆంధ్రభృత్యవంశములోని రెండవవాడు కృష్ణుడని పురాణములన్నియు బేర్కొనుచున్నవి. శ్రీశాతకర్ణిని వాయువిష్ణుపురాణములు మూడవవాని