పుట:Andhrula Charitramu Part-1.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదంతయు జరుగుచుండగా క్షీరధరుడను నుత్తరదేశపురాజొకడామహిమ గల దంతమును బడయుటకై పాటలీపుత్రముపై దండెత్తి వచ్చెనుగాని యచ్చట జరిగిన యుద్ధములో నాతడు మృతిచెందెను. అంతట గుహాశివుడు దంతముతో దన రాజధానికి మరలివచ్చెను. కొంతకాలమునకు క్షీరధరుని సోదరపుత్రులు మఱికొందఱు రాజులను దోడుచేసుకొని గుహాశివునిపై దాడివెడలివచ్చిరి. వారల నెదుర్కొనుట సాధ్యముగాక గుహాశివుడాత్మరక్షణమునకై చూచుకొనసాగెను. యుద్ధము చేయుటకు ముందు తన కొమార్తెయగు హేమాచలను, ఉజ్జయినీ పురాధీశ్వరుని కుమారుడును తన కల్లుడునగు దంతకుమారుని నుభయులను రప్పించి తానోడిపోయిన యెడల నా దంతమును దీసికొని తప్పించుకొనిపోయి సముద్ర మార్గమున సింహళ ద్వీపమునకు బోయి యా ద్వీపమునేలుచుండి యా దంతమును గొనవలయునని కోరికగలిగియుండిన మహాసేనునకు నిచ్చివేయవలసినదని చెప్పెను. అట్లు దంతపురము శత్రువుల వశమగుటకు పూర్వమే దంతకుమారుడును, హేమాచలయు నా దంతమును నిసుకలో బూడ్చిపెట్టి పట్టణము విడిచి పాఱిపోయి తరువాత మరలివచ్చి హేమాచల యాదంతమును వేణియందు దాచుకొని భర్తతోగూడ తామ్రలిప్తినగరమునకు బోయి యచ్చట నా రాజదంపతులిరువురు నోడనెక్కి సింహళ ద్వీపమునకు బ్రయాణము జేసిరి. ఓడనెక్కిన ప్రదేశమునకు సింహళమునకు నడుమ వజ్రాలదిన్నె (Diamonds Sands) సమీపమున వారెక్కిన యోడ మెట్టయెక్కెను. ఈ వజ్రాలదిన్నె (Diamonds Sands) నడుమనున్నదని చెప్పటచేతను, తీరమునకు సమీపముగా వజ్రములుండు ప్రదేశమిదియే యగుటచేతను,ఇంతియగాక నాగరాజునకు నివాసమని తరువాయి కథవలన బోధపడుచుండుటచేతను కృష్ణానదీతటమె (ధాన్యకటక ప్రదేశ తీరమె) యోడ మెట్టపట్టిన స్థలమని డాక్టరు ఫెర్గూసనుగారు దృఢముగా విశ్వసించుచున్నారు. [1]రాజకుమారికయగు హేమాచల నిద్రబోవుచుండగా నాగరాజు దంతమును తస్కరించెనుగాని హిమాలయమునుండి వచ్చిన యొక దేవతయొక్క మాంత్రికశక్తిచేత

  1. Dr.Ferguson's Tree & Serpent worship; p.157.9.