పుట:Andhrula Charitramu Part-1.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధుని దంతకథనము.

బుద్ధుని దంతమును గూర్చి కథలు పెక్కులుగలవుగాని వానిలో రెండు కథలు ముఖ్యములయినవిగా గన్పట్టుచున్నవి. [1]అందు మొదటిగాథ యిట్లు చెప్పబడుచున్నది. బుద్ధుని యెడమ పార్శ్వమునందలి దంతము కళింగదేశమునకు రాజధానికయగు దంతపురమునందు (బహుశః) నిప్పటి జగన్నాధాలయ మనబడు ప్రదేశమున నెనిమిది వందల సంవత్సరముల వఱకు సురక్షితముగ నుంచబడియెను. క్రీస్తు శకము నాలుగవ శతాబ్ద ప్రారంభమునందు గుహాశివుడను రాజు తానప్పటివఱకు నవలంబించియుండిన బ్రాహ్మణ మతమును విడిచిపెట్టి బౌద్ధమతము నవలంబించెను. క్రొత్తమతమవలంబించిన పట్టుదలచేత నాతడు తన్నాశ్రయించుకొనియున్న బ్రాహ్మణులను దొలగించి వారలను బాధపెట్టనారంభించెను. వారలు పాటలీపుత్రమునకు బోయి రాజాధిరాజగు పాండు [2]నకు జెప్పి మొఱవెట్టుకొనగా నాతడు గుహాశివుని దంతముతో గూడ దన కొల్వుకూటమునకు రావలసినదిగా నుత్తరువు చేసెను. ఆ యుత్తరపు ప్రకారము వచ్చిన మీదట దంతమును సర్వవిధముల భగ్నము చేయుటకు బ్రయత్నము జరుపబడి తుదకు దంతమునకే విజయము కలిగెను. అంతటా పాండురాజు దంతమాహాత్మ్యమునకచ్చెరువంది తుట్టతుదకు దానే బుద్ధధర్మమవలంబించెను.

  1. The first is contained in Daladavamsa partially translated by the Honourable G.Turnour and published in the Journal of Asiatic Society of Bengal Vol.VI. p. 856 et. Seq; the other is abstracted by Colonal Low from the Siamese phra Pal'hom, and published in the Same Journal Vol.XVII. part II. p.82, et, seq.
  2. ఇతడే గోతమిపుత్త్ర శ్రీ శాతకర్ణి కావచ్చునని డాక్టరు ఫెర్గూసనుగారు తలంచుచున్నారు గాని వారి యభిప్రాయము సరియైనది కాదని తోచుచున్నది.