పుట:Andhraveerulupar025958mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నలుదిక్కుల బాగుగా నావరించి యుండెను. బాలుడు ఆకలిగొని యేడ్చుచుండెను. చేతులార పసిపాపని సముద్రములో బాఱవేయ జాలక కన్నమ నాయకుడు మైమఱచి యెలుగెత్తి యేడువసాగెను. దిక్కులేని సముద్రప్రాంతమున వారల నోదార్చువా రెవరు? కన్నమనాయ డిటుల నేడ్చుచుండగా జెంత నెవరో "ఎవరునీవు? ఈయర్థరాత్రమున నిర్జనప్రదేశమందు విలపించుటకు గారణమే"మని యడిగిరి. వారిరువురు నీక్రిందివిధముగా జీకటిలోనే సంభాషించుకొనిరి.

"ఎవడవు నీవు? ఇచటికేల వచ్చినాడవు?"

"నేనెవడనో నీకు జెప్పవలసిన యవసరములేదు. ఊరక ప్రసంగింపక నీవు వచ్చినత్రోవను బొమ్ము! నీకిచట నేమిపని?"

"నేనెవడనో నీకుదెలుపువఱకు నీవృత్తాంతము తెలుపవుకాబోలును. జాగ్రత్తగా నొడలెఱింగి నీ కులశీలముల దెలుపుము, లేదా నిన్నుఖండింపక మానను."

"సంగరమునకు దొరకొన్నచో నన్ను నీవు ఖండింతువని యెటుల జెప్పగలవు? విజయము బలాబలములపై నాధారపడి యుండును. ఒకవేళ నీవే గతింతువేమో!"

"మితిమీఱి భాషించుచున్నాడవు. నీవు దొంగవాడవు కానోపుదువు. కాదేని నీవృత్తాంతము మరుగుపఱుపవలసినపని యేముండును? నగలకొఱ కీబాలకుని జంపుచుంటివి కాబోలు"

"నిన్నుమాత్రము చంపక విడుతునా"