పుట:Andhraveerulupar025958mbp.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాగా నిక నుపేక్షింప దగదని యారాజమాత్రుడు అంత:పురకాంతలను రాజమందిరమును సంపదలను విడిచి ప్రాణభయముతో దొడ్డివాకిలి తెఱచికొని పారిపోయెను. నరసరాజు కోటను భాండాగారమును ధనకనకవస్తువాహనములను రక్తపాతము లేకుండ సాధించి యీవిజయవర్తమానము తన యజమానియగు సాళ్వ నరసింహరాజునకు దెలిపి పట్టాభిషిక్తుడగుటకు రమ్మని వర్తమాన మంపెను. ప్రజలందఱు మఱల సత్ప్రభువె తమకు లభించెనని మిగుల నానందించి పట్టాభిషేకమహోత్సవ మెపుడుజరుగునా యని నిరీక్షించు చుండిరి. నరసరాజు రాజకీయోద్యోగుల నందఱను బరిశీలించి పూర్వరాజ పక్షపాతు లగువారిని వెదకి యుద్యోగముల నుండి తొలగించి యాపదవులను విశ్వాసపాత్రులగు తన నౌకరుల కొసంగెను. విద్యానగర రాజ్యమునం దంతటను నూతనోద్యోగులను నరసరాజు నెలకొల్పి విప్లవోద్యమములకు దావేలేకుండ జేసెను.

శాస్త్రవేత్తలు పెట్టిన శుభముహూర్తమున బట్టాభిషేకమహోత్సవము జరుపుటకు నేర్పాటులు చేయబడెను. సామంతులకు రాజబంధువులకు గవులకు గాయకులకు సేనానాయకులకు ఉద్యోగులకు ఆహ్వానపత్రికలను నరసరాజు, తిమ్మరుసుమంత్రి స్వయముగా బంపిరి. సాళ్వ నరసింహభూపాలిని దామంద ఱంతకు మున్నె యెఱింగి యుంట