పుట:Andhraveerulupar025958mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిగావించి అష్టదిగ్రాజ మనోభయంకర, సోమకులపరశురామాది' బిరుదములు గాంచి సమకాలిక రాజన్యులలో మిన్నయై యనపోతనాయడు మిగుల విఖ్యాతి నార్జించెను. అనపోతభూపాలుడు సోమకుల పరశురామాది బిరుదముల వహించినటుల నాతని శాసనములయందె గాక రసార్ణవసుధాకరమున సైత మీతనిపుత్రుడగు సర్వజ్ఞ సింగభూపాలుకు డీక్రింది విధముగా వ్రాసియుంటచే నీకథ విశ్వసనీయ మైయున్నది.

శ్లో|| సోమకుల పరశురామే భుజబలభీమేధిభూమిగోపాలే
    యత్రచ జాగ్రతి శాస్తరి జగతాం జాగర్తి నిత్యకళ్యాణం||

(సోమకుల పరశురాముడు, భుజబల భీముడు, రణదేవేంద్రుడు మొదలగు బిరుదరాజములు గల యన్నపోత భూపాలుడు రాజ్యము పరిపాలించుచుండగా లోకములో శుభపరంపర వెలయసాగెను.)

అనపోతనాయకుడు జల్లెపల్లి క్షేత్రమున గావించిన ఘోర సంగ్రామముతో నాతనిప్రశస్తి దశదిశా పరివ్యాప్త మయ్యెను. ప్రతిఘటింపవచ్చిన రాజవంశీయు లందఱకు సంపూర్ణమైన పరాభవము కలిగెను. అనపోతనాయనిపౌరుష మా విజృంభణముతో నాటివారికి దెలియుటచే విద్వేషభావమును మానికొని ప్రతిపక్షులు శాంతమార్గగాములై సంచరించిరి. అనపోతనాయని విజయముల దెల్పునీక్రిందిగద్యమును నామన గల్గునివాసులగు బట్టులు నేటికి బఠింపుచున్నారు.