పుట:Andhraveerulupar025958mbp.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పాలించిన ప్రథమ హరిహరరాయల బుక్కరాయలద్వితీయ హరిహరరాయల కాలములలో మంత్రిగ ధర్మోపదేశికుడుగా నుండి రాజ్యక్షేమమె వైదికమతక్షేమముగా భావించి ఆయారాజులను వైదికధర్మప్రపక్తులుగ నేర్పఱచి నూఱు సంవత్సరములకంటె నెక్కుడుకాలము జీవించి క్రీ.శ. 1386 లో సమాధిగతు డయ్యెను. తమ్ముడగు సాయణాచార్యులుగూడ సంగమరాజు నొద్ద మంత్రిగానుండి విద్యానగరమునకు దగినసేవ గావించి రాజ్యసహాయమున మతసంరక్షణమున నెక్కువ పాటుపడెను.

విద్యారణ్యులవారి యుపనిష ద్భాష్యములు, వేదాంత పంచదశి, వివరణ ప్రమయసంగ్రహము, బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి లోనగు గ్రంథములు అద్వైతమతప్రవిష్టులగు విద్వాంసులు మిగుల బూజ్యభావముతో బఠించుట యీ మహామహుని ప్రశస్తికి దార్కాణము. తొలుత రాజ్యమును నిలువ బెట్టుకొన్నగాని మతధర్మముల గాపాడుకొన జాలవని మహా సామ్రాజ్యమును నెలకొల్పి దాని క్షేమమె తన క్షేమమని భావించిన విద్యారణ్యుల జీవితము నేటి పండితలోకమున కాదర్శప్రాయ మయ్యెనేని భరతఖండము సర్వవిధముల నభ్యున్నతికి రాకపోదు. మానవజీవితమునకు, మతమునకు విజ్ఞానమునకు, స్వరాజ్యమునకు సంబంధము కలుగజేయుట మహాత్ముడగు విద్యారణ్యుల యాశీర్వచనమున నాంధ్రులకు బట్టువడ బరమాత్ము డనుగ్రంచుగాత!