పుట:Andhraveerulupar025903mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరద్వీపవస్తువు లచటికి వచ్చునట్లును జేసెను. స్వయముగా బండితు డగుటచే శాతకర్ణి వర్ణాశ్రమధర్మముల గుర్తించి వర్ణములను సంకరముగాకుండ గట్టుదిట్టములను మిక్కిలి దిట్టముగాజేసెను. దండయాత్రలలో నీ దేశమునకు వచ్చి యిచటనే ప్రాతకాపులుగానున్న విదేశీయుల నాదరించి వారి కెట్టిపన్ను లవసరము లేకుండజేసి శాతకర్ణి వారి కెన్నియో సౌకర్యములు కలుగజేసెను. పూర్వరాజులు తమపేరుముందు మాతృనామ ముంచుకొని వ్యవహరించినటుల గానరాదు. శాతకర్ణి తన మాతృదేవియగు గౌతమీనామమును తన పేరుతో గలిపికొని గౌతమీపుత్ర శాతకర్ణియనియె వ్యవహరించెను. దీనిచే నీతనికి గల యపారమగు మాతృభక్తి వెల్లడి యగుచున్నది.

గౌతమీపుత్రుడు క్రీ.శ. 133 మొదలు 154 వఱకు రాజ్యమును బాలించియుండునని యింతవఱకు లభించిన శాసనా ద్యాధారములవలన దెలియుచున్నది. ఇతని ధర్మపత్ని వాసిష్ఠి. ఈరాజన్యుని జీవితమునందలి యపూర్వాంశము లెన్నియో కాలగర్భమున మరుగుపడియున్నవి. శాతకర్ణి యపూర్వ చరిత్ర మంతయు గీర్యంకములుగ బరిగణింపబడు శిలాశాసనములం దింకను అజ్ఞాతావస్థయందె యున్నదని యొప్పుకొనక తప్పదు. మహావిస్తృతమైన ఆంధ్రసాంరాజ్యమునకు నెలవైన ధాన్యకటకము నేడు పూర్వవైభవములన్నియు గోలుపోయి చిఱుపల్లెగా మాఱిపోయినది. ఆంధ్ర